గుడ్‌న్యూస్ చెప్పిన మరో సంస్థ.. 70 వేల ఉద్యోగాలు..

గుడ్‌న్యూస్ చెప్పిన మరో సంస్థ.. 70 వేల ఉద్యోగాలు..

కరోనా ఎఫెక్ట్‌తో ఇతర రంగాలు తీవ్రంగా నష్టపోతే.. ఆన్‌లైన్‌ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది.. కరోనా సమయంలో లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు.. ఇక, అంతా ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గుచూపుతుండడంతో.. ఈ రంగంలో ఉద్యోగాలను కూడా భారీ సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అమెజాన్ లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకోగా... తాజాగా.. ఫ్లిప్‌కార్ట్ కూడా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈకార్ట్ అండ్ మార్కెట్ ప్లేస్ ఉపాధ్యక్షుడు అమితేష్ ఝా మాట్లాడుతూ.. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అదనపు అవకాశాలు ఇస్తూనే వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని ఇచ్చేందుకు ప్రభావంతమైన భాగస్వామ్యాలు సృష్టించడంపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. 

70 వేల మంది వరకు కొత్త ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోనున్నట్టు తెలిపారు.. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ తాను నియమించుకునే వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది. ఇందులో సర్వీస్, డెలివరీ, ఇన్‌స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్ చర్యలు, పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, వివిధ రకాల మొబైల్ అప్లికేషన్లు, ఈఆర్‌పీ వంటివి ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో పూర్తిగా ఆన్‌లైన్ అమ్మకాలు నిలిచిపోగా... ఆ తర్వాత సడలింపులు వచ్చినప్పటి నుంచి క్రమంగా ఆన్‌లైన్ వ్యాపారం పుంజుకుంది. బయటకు వెళ్లి షాపింగ్ చేసేవారి తగ్గిపోయి.. క్రమంగా ఈ కామర్స్ సంస్థలు ఆశ్రయిస్తుండడంతో.. వారి అభిరుచులకు అనుగుణంగా.. కొత్త ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా సంస్థలు.  పండుగ సీజన్‌ల్‌లో ప్రత్యేక ఆఫర్లతో స్పెషల్ సేల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి ఈకామర్స్ సంస్థలు.