ప్రపంచమంతా మత్స్యకార దినోత్సవం.. కానీ అక్కడ నిరసన దినం !

ప్రపంచమంతా మత్స్యకార  దినోత్సవం.. కానీ అక్కడ నిరసన దినం !

ఏపీలో మత్స్య రంగానికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, అయినప్పటికీ మత్స్యకారుల జీవితాలు చాలా దయనీయంగా ఉన్నాయని అన్నారాయన. సరైన సౌకర్యాలు లేకపోవడంతో గుజరాత్ వంటి ప్రాంతాలకు వలస పోతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పొడవాటి తీర ప్రాంతం ఉన్నప్పటికీ ఫిషింగ్ హార్బర్లు లేవని తెలిపారు.

విదేశాల్లో మగ్గుతున్న తెలుగు మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చామని గుర్తు చేశారు సీఎం జగన్. అయితే  ప్రపంచ మత్స్యకార  దినోత్సవాన్ని నిరసన దినంగా పాటించారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మత్స్యకారులు . తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మత్స్యకారులు జల దీక్ష చేపట్టారు. కాకినాడ కుంభాభిషేకం సముద్ర తీరం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిరసన తెలిపారు. రెండేళ్లు పూర్తవుతున్నా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం మత్స్యకారుల స్థలాలు ఇవ్వడం దారుణమన్నారు. మడ అడవులను కప్పడం వల్ల మత్స్యకార గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని మండిపడ్డారు మత్స్యకారులు.