కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెడీ..! తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెడీ..! తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.. కొన్ని చోట్ల సెకండ్ వేవ్.. మరికొన్ని దేశాల్తో థర్డ్ వేవ్‌ ప్రజలు, ప్రభుత్వాల్లో వణుకుపుట్టిస్తోంది... మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ కోసం రకరకాల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే కొన్ని విడుదలైనా.. అందుబాటులోకి రాలేదు. భారత్‌లోనూ కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ సిద్ధమవుతోంది.. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సిన్‌పై సీఎంలతో చర్చించారు. ఇక, ఒక‌వేళ కోవిడ్ టీకా సిద్ధమైతే, అప్పుడు తొలి ద‌శ‌లో సుమారు 30 కోట్ల మంది భార‌తీయుల‌కు ఆ టీకాను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.. దీనిపై భార‌త ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ను కోవిడ్ వారియర్స్‌కు ముందుగా ఇవ్వాలనే నిర్ణయానికి రాగా.. మొదట.. హెల్త్ కేర్ వ‌ర్కర్లు, పోలీసులకు ఇవ్వనున్నారు.. ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వారితో పాటు అనారోగ్యంగా ఉన్న యువ‌త‌కు కూడా ఈ టీకాను తొలి ద‌శ‌లో ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ కే విజ‌య్ రాఘ‌వ‌న్ వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీపై నేష‌న‌ల్ వ్యాక్సిన్ క‌మిటీ చీఫ్‌ డాక్టర్ వీకే పౌల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు రాఘవన్‌ చెప్పారు. ఇక, 2021 మార్చి - మే వ‌ర‌కు కోవిడ్ వ్యాక్సిన్ కావాల్సిన స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. కాగా, రేపు హైదరాబాద్‌, పుణెలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న సంగతి తెలిసింది.. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూపొందిస్తు కో వ్యాక్సిన్‌ పనితీరుపై ఆయన ఆరా తీయనున్నారు.