భారత్‌కు పెరిగిన ఎఫ్‌డీఐలు.. 6 నెలల్లో 30 బిలియన్‌ డాలర్లు..!

భారత్‌కు పెరిగిన ఎఫ్‌డీఐలు.. 6 నెలల్లో 30 బిలియన్‌ డాలర్లు..!

భారత్‌లో క్రమంగా ఫారెన్ ఇన్వెస్టిమెంట్స్ పెరుగుతున్నాయి.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6 నెలల్లోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 15 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని చెప్పవచ్చు... 6 నెలల కాలంలో 15 శాతం అంటే.. దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థిక సమయంలో ఇదే కాలంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది.. కాగా, కరోనా సమయంలోనూ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు పుంజుకోవడానికి అంబానీ కంపెనీల్లోకి వచ్చిన భారీ పెట్టుబడులు ఎంతో దోహదం చేశాయని చెప్పుకోవాలి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం రంగాలవారీగా చూస్తే టాప్ 10లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సాఫ్టువేర్, హార్డ్‌వేర్ రంగాలు ముందున్నాయి. మిగతా 9 రంగాల్లో పెట్టుబడులు తగ్గినట్టు చెబుతున్నారు. 

ఇక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే.. గుజరాత్‌కు 16 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు రాగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక ఉన్నాయి. సర్వీసుల రంగానికి 17 శాతం పెట్టుబడులు రాగా.. అందులో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్ సోర‍్సింగ్ కలసి ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్టువేర్, హార్డువేర్ విభాగానికి 12 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి. టెలికం రంగానికి 7 శాతం, మహారాష్ట్రకు 20 శాతం, కర్ణాటకకు 15 శాతం, ఢిల్లీకి 12 శాతం చొప్పున ఎఫ్‌డీఐలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. దేశంలోఎఫ్ డీఐలకు అనువైన వాతావరణం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఎఫ్‌డీఐలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు గోయల్.