అప్పటి వరకు ఢిల్లీ నుంచి కదిలేదిలేదు.. అన్నదాతల ప్రకటన..

అప్పటి వరకు ఢిల్లీ నుంచి కదిలేదిలేదు.. అన్నదాతల ప్రకటన..

రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఆందోళన చేస్తున్న రైతులు బురారీ మైదానానికి వెళ్లాలన్న సూచనకు నో చెప్పాయి. జంతర్ మంతర్ లేదా రామ్‌లీలా మైదానంలో నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన అజెండా అని తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిరసనలు విరమించేది లేదన్నారు. ఢిల్లీ వెళ్లే 5 ప్రధాన రహదారులపై బైఠాయిస్తాం.. మా డిమాండ్లకు కేంద్రం స్పందించే వరకు పోరాటం చేస్తాం, 4 నెలలకు సరిపడా నిత్యావసరాలు తెచ్చుకున్నాం అని ప్రకటించారు రైతు సంఘాల నేతలు.

ఢిల్లీలో నిరసనకు ప్రభుత్వం ముందు అనుమతి నిరాకరించడంతో సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద ఐదు రోజులుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లే ప్రధాన రహదారులు దిగ్బంధం అయ్యాయి. డిసెంబర్‌3న చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని  కేంద్రం ప్రకటించినా రైతులు తమ ఆందోళనలు విరమించలేదు. కేంద్ర హోంమంత్రికి పక్కనే ఉన్న రైతులతో మాట్లాడేందుకు తీరిక లేదు.. కానీ.. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో రోడ్‌షో చేసేందుకు సమయం ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది హస్తం పార్టీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల మేలు కోసమేనన్నారు ప్రధాని మోడీ. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు మన్‌కీ బాత్‌లో తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులు నూతన వ్యవసాయ చట్టాల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ అభిప్రాయపడ్డారు. రైతులను కాంగ్రెస్‌తో పాటు మరి కొన్ని పార్టీలు రెచ్చ గొడుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నదని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆపిన విధానం చూస్తే ప్రభుత్వం వారిని ఈ దేశానికి చెందినవారిలా చూస్తున్నట్లు కన్పించడం లేదని విమర్శించారు. చట్టాల్ని రద్దు చేయాలని రైతులు.. కొనసాగించాల్సిదేనని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.. ఈ సమస్య ఎలాంటి మలుపు తిరుగుతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది.