వ్యవసాయ బిల్లులు : దేశ రాజధాని ఢిల్లీని తాకిన నిరసనల సెగ...

వ్యవసాయ బిల్లులు : దేశ రాజధాని ఢిల్లీని తాకిన నిరసనల సెగ...

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌, హర్యానాతో పాటు రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌లోనూ  రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే... నిరసనల సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఇండియా గేట్‌ వద్ద కు పెద్ద ఎత్తున రైతులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఓ ట్రాక్టర్ ను, ప్రధాని మోడి దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేసి.. ఆందోళన చేస్తున్నారు రైతులు.  పంజాబ్‌ ముద్దబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి నాడు పంజాబ్‌ యువజన‌ కాంగ్రెస్ ఆధ్వరంలో రైతుల నిరసన కార్యక్రమం చేపట్టారు.  వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమృత్‌సర్‌–ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసనలు చేస్తున్నారు.

ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగానే.. పార్లమెంట్ ఆమోదం పొందాయి మూడు వ్యవసాయ బిల్లులు.  “రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020”, “రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020”, “నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020” లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం ముద్ర కూడా వేశారు. వ్యవసాయ రంగం, రైతుల పాలిట క్యాన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలని ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ లేఖ రాసింది. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఎన్‌.డి.ఏని వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ పార్టీలను ‌కోరుతూ ఆ పార్టీలకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింద. అయితే..పంజాబ్ లో జరిగే రైతు ఆందోళన కార్యక్రమంలో స్వయంగా రాహుల్ గాంధీ పాల్గొననున్నారని సమాచారం.