భారత ఓటమితో రోహిత్ కెప్టెన్సీకి పెరిగిన మద్దతు...

భారత ఓటమితో రోహిత్ కెప్టెన్సీకి పెరిగిన మద్దతు...

ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు వరుస ఓటములతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. ఈ వరుస పరాజయాలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తొడ కండరాల గాయంతో ఈ టూర్‌లోని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ ఎంపిక కానీ విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఫిట్‌గా లేకపోవడం ఏందని, ముమ్మాటికీ ఇది కోహ్లీ కుట్రేనని టీమ్ సెలక్షన్ సమయంలో హిట్ మ్యాన్ అభిమానులు ఆరోపించారు. అలాగే ఆస్ట్రేలియా పర్యటన ముంగిట రోహిత్ శర్మకి వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని.. విరాట్ కోహ్లీని కేవలం టెస్టులకే కెప్టెన్‌గా పరిమితం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించింది. పైగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలు కూడా జట్టు ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా మైదానంలో విరాట్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి.