బీజేపీలో చేరిన తృణమూల్ నేత.. క్షమించండి అంటూ స్టేజీపై గుంజీలు..!

బీజేపీలో చేరిన తృణమూల్ నేత.. క్షమించండి అంటూ స్టేజీపై గుంజీలు..!

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. పాలక, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓవైపు సాగుతుంటే.. మరోవైపు.. రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.. అయితే, ఇవాళ ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.. మేధినీపూర్‌ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సుశాంతా పాల్‌.. భారతీయ జనతా పార్టీలో చేరాడు.. ఈ సందర్భంగా టీఎంసీ, సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆయన.. మమతా ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎంసీలో కొనసాగి ఇంతకాలం చాలా తప్పు చేశానని... అందుకు తనను ప్రజలు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు.. తన రాజకీయ జీవితంలో ఎదురైన కొన్ని చేదుఅనుభవాలను గుర్తుచేసుకున్న ఆయన.. తన గొంతును తృణమూల్ నేతలు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ప్రజల గొంతును వినిపించేందుకు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆయన.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి చెవులు పట్టుకుని స్టేజీపైనే గుంజీలు తీశారు.. అయితే, సుశాంతాపాల్‌ను నాలుగు సంవత్సరాల క్రితమే పార్టీ నుంచి తొలగించినట్టు తృణమూల్ నేతలు చెబుతున్నారు. తృణమూల్‌ను ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడుతున్నారు.