మోడీ సమక్షంలో బీజేపీ గూటికి ఏపీ మాజీ మంత్రి..!?

మోడీ సమక్షంలో బీజేపీ గూటికి ఏపీ మాజీ మంత్రి..!?

శనివారం రోజు జనసేన పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి రావెల కిషోర్ బాబు.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజీనామా లేఖ పంపిన తర్వాత ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ప్రత్యేకంగా భేటీ అయిన పార్టీలో చేరికపై చర్చించనట్టు తెలుస్తోంది. ఆయన చేరికను కన్నా లక్ష్మీనారాయణకు కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, అన్నీ కుదిరితే ఇవాళే ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు రావెల కిషోర్ బాబు. ఇవాళ, తిరుపతి, తిరుమలలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ... తిరుపతిలో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే, ఇదే వేదికపై రావెల కిషోర్ బాబు.. కమలం పార్టీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. 

కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రావెల కిషోర్ బాబు.. అనంతరం చంద్రబాబు కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. కొన్ని కారణాలతో కేబినెట్ విస్తరణ సమయంలో తన పదవి కోల్పాయిన ఆయన.. కొంత కాలం టీడీపీలోనే కొనసాగినా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. ఇక, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన రావెల.. మరోసారి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓటమి పాలయ్యారు.