రైతులు సూసైడ్ లు చేసుకోక ముందే ప్రకటన చేయాలి !

రైతులు సూసైడ్ లు చేసుకోక ముందే ప్రకటన చేయాలి !

రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో  ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. రాజధానిపై తలెత్తిన గందరగోళాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకముందే ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. తలా ఓ రకంగా మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే వాళ్లు ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉందని ప్రత్తిపాటి హెచ్చరించారు.

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ నాలుగు రాజధానులంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారని, దానిపైన కూడా ప్రభుత్వం స్పందించాలని ప్రత్తిపాటి కోరారు. చంద్రబాబుపై కోపం ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ ప్రాజెక్టులు ఆపి ప్రజలకు నష్టం చేయొద్దని ఆయన పేర్కొన్నారు. ఇక మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు ధర్నా చేశారు. రాజధానిపై ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రోడ్డుపై రైతులు బైఠాయించారు. సచివాలయం వెళ్లే దారిలో కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.