జగన్ పిలిచి పదవిచ్చినా, ఆ నాయకున్ని దూరం పెడుతున్న జిల్లా నేతలు !

జగన్ పిలిచి పదవిచ్చినా, ఆ నాయకున్ని దూరం పెడుతున్న జిల్లా నేతలు !

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా తయారైంది ఆ MLC పరిస్థితి. అధినేత పిలిచి మరీ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ జిల్లా నేతలు ఆయన్ని దూరం పెడుతున్నారట. విజయనగరం జిల్లా అధికారపార్టీలో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ? ఎందుకు దూరం పెడుతున్నారు? 

సీఎం జగన్‌ పిలిచి ఎమ్మెల్సీని చేశారు!

పెన్మత్స సూర్యనారాయణరాజు. వైసీపీ ఎమ్మెల్సీ. విజయనగరంలో అంతా సురేష్‌బాబు అని పిలుచుకుంటారు. మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుమారుడిగానూ గుర్తింపు ఉంది. 2014లో నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లాలో తొలిసారిగా వైసీపీ జెండా మోసిన కుటుంబంగా పార్టీ అధిష్ఠానం గుర్తుపెట్టుకుంది. 2019లో టికెట్‌ ఇవ్వకపోయినా.. ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు అధినేత. ఆ ఆశ తీరకుండానే సాంబశివరాజు చనిపోయారు. తర్వాత రోజుల్లో సురేష్‌బాబును సీఎం జగన్‌ పిలిచి ఎమ్మెల్సీని చేశారు. 

నెల్లిమర్లలో సురేష్‌బాబును పట్టించుకోవడం లేదు!

ఇంతవరకు బాగానే ఉన్నా... సురేష్‌బాబు ఎమ్మెల్సీ అయిన  తర్వాతే విజయనగరం జిల్లాలో అసలు కథ మొదలైంది. జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు సురేష్‌బాబును దూరం పెడుతున్నారట. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదట. ఒకప్పుడు తమ కుటుంబం చక్రం తిప్పిన నెల్లిమర్లలోను ఆయనకు తగిన గౌరవం లభించడం లేదని చెబుతున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఒకవేళ నెల్లిమర్లలో ఎమ్మెల్సీకి ప్రాధాన్యం ఇస్తే ఎమ్మెల్యే కోప్పడతారని అనుకున్నారో లేక వారికేమైనా ఆదేశాలు వెళ్తున్నాయోకానీ సురేష్‌బాబును పట్టించుకోవడమే మానేశారట అధికారులు.  

2024 నాటికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వస్తారని అనుమానం?

నెల్లిమర్లను కాసేపు పక్కన పెడితే.. జిల్లాకు ఎవరైనా మంత్రులు వచ్చినా.. పర్యటించినా ఎమ్మెల్సీ సురేష్‌బాబుకు చెప్పడం లేదని పెన్మత్స అభిమానుల్లో చర్చ జరుగుతోందట. సురేష్‌బాబు  పదవీ కాలం 2023 మార్చి వరకు ఉంది. ఒకవేళ ఆయనకు ప్రాధాన్యం ఇస్తే 2024 ఎన్నికల నాటికి  ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వస్తారనే అనుమానాలు ఉన్నాయట వైసీపీలోని ప్రత్యర్థులకు. నెల్లిమర్లలో పాగా వేయాలని అనుకుంటున్న వారికి ఈ పరిణామాలు రుచించడం లేదని సమాచారం. అందుకే ప్రజలకు, అధికారులకు ఎమ్మెల్సీని దూరం చేస్తే తమ పని ఈజీగా వర్కవుట్‌ అవుతుందని ప్లాన్‌ వేశారట. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. సీఎం జగన్‌ గుర్తించి.. పిలిచి పదవి ఇచ్చిన నాయకుడి విషయంలో సొంత పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి హాట్‌ టాపిక్‌గా మారింది. 

సురేష్‌బాబు కౌంటర్‌ అటాక్‌ ఇస్తే రాజకీయం వేడెక్కుతుందా? 

ఈ పరిణామాలపై సురేష్‌బాబు కౌంటర్‌ అటాక్‌ మొదలు పెడితే మాత్రం రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం. ఆధిపత్యపోరుకు దారితీస్తే  విభేదాలు, గొడవలు తప్పవు. ఇప్పటికైతే ఆ సూచనలు కనిపించకపోయినా.. భవిష్యత్‌లో ఏమో ఏం జరుగుతుందో అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.