దేవాలయాలు కాదు... అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందాం : ఎర్రబెల్లి

దేవాలయాలు కాదు... అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందాం : ఎర్రబెల్లి

భాగ్యలక్ష్మి భద్రకాళి దేవాలయాలు కాదు... అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి సూచించారు.  దయచేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్ట వద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు.  బిజెపి పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తూ అధికారంలో ఉందని... ఇలాంటి స్థానంలో ఉన్న పార్టీ గాని, అలాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామ్యంపై గౌరవం తిరిగేలా మాటలు, విమర్శలు ఉంటే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. అధికారమే పరమావధి కాదని, ప్రజా సేవ, ప్రజల యోగక్షేమాలు, సమాజంలో శాంతియుత పద్ధతులు కొన సాగాలన్నారు. బండి సంజయ్ మాటలు ప్రజలను, వారి మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి మీద తెలుసుకోవాలనుకుంటే ఎవరు ఏం చేశారన్నది ప్రజలకు తెలిసేలా అధికారికంగానే సమావేశం అవడానికి సిద్ధపడాలని మంత్రి బండి సంజయ్ కి సూచించారు. ఏ వో కొన్ని మాటలతో రెచ్చగొట్టి,  ప్రజలను మోస పుచ్చే మాటలు మంచివి కావని హితవుపలికారు.