రివ్యూ: ఎంత మంచివాడవురా  

రివ్యూ: ఎంత మంచివాడవురా  

నటీనటులు: క‌ల్యాణ్‌ రామ్‌, మెహ‌రీన్‌, సుహాసిని, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సుదర్శన్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు

మ్యూజిక్: గోపిసుందర్ 

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట 

నిర్మాతలు: ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త 

దర్శకత్వం : వేగేశ్న సతీష్ 

కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు.  మాస్ ను మెప్పించే సినిమాలు చేశారు.  ఎన్నో వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేశారు.  అయితే, మొదటిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ఇదే మొదటిసారి.  శతమానం భవతి వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన వేగేశ్న సతీష్ కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా తీశారు.  సంక్రాంతి పండగ రోజున రిలీజైన ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  

కథ: 

చిన్న తనంలోనే బంధాలు బంధుత్వాల విలువ గురించి తెలుసుకున్న కళ్యాణ్ రామ్, తన చిన్ననాటి స్నేహితురాలైన మెహరీన్ తో కలిసి షార్ట్ మూవీస్ చేస్తుంటారు.  స్నేహితులకి కళ్యాణ్ రామ్ ఒక స్నేహితుడిగా తెలుసు, అయితే, ఊర్లో అందరికి మాత్రం మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా ఇలా బంధాలతో అనుబంధాలతో వారితో కలిసిమెలిసి ఉంటాడు.  వివిధ రకాల పేర్లతో అందరికి చేరువైన కళ్యాణ్ రామ్, ఆచార్య అనే పేరుతో ఓ ఇంటికి వెళ్ళాక అక్కడ అనేక సమస్యలు ఎదురౌతాయి.  ఎదురైన సమస్యలను కళ్యాణ్ రామ్ ఎలా పరిష్కరించారు? చిన్ననాటి స్నేహితురాలు మెహరీన్ తో జీవితం పంచుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

బంధాలు, అనుబంధాలు, వాటి చుట్టూ ఉండే ఎమోషన్ చుట్టూనే సినిమా నడుస్తుంది.  అన్నింటికంటే సున్నితమైన అంశం ఏదైనా ఉందా అంటే అది బంధం అనుబంధం అని చెప్పాలి.  వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే... వారి మధ్య ఎమోషన్ బాండ్ అంత బలంగా ఉంటుంది.  కళ్యాణ్ రామ్ ఒక్కో పేరుతో ఒక్కోచోట కనిపిస్తూ ఉంటారు.  అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మసులుకుంటూ ఉంటాడు.  ఏదొక సమయంలో, ఏదొక పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అనడంలో సందేహం అవసరం లేదు.  ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేయడంలోనే విజయం దాగుంది.  కథలో అంతర్లీనంగా ఉన్న భవోద్వేగాలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యితే... సన్నివేశం పండుతుంది.  సినిమాకు మంచి పేరు వస్తుంది.  కానీ, ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉన్నా అవి పండలేదని చెప్పాలి.  కొన్ని మాత్రమే ఎమోషనల్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి.  ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఓ సంస్థ ఉంటుంది.  ఆ సంస్థలు వినియోగదారులకు అవసరమైన వాటిని సప్లై చేస్తుంటారు.  ఇందులో హీరో కూడా బంధాలను సరఫరా చేసే సంస్థను ఏర్పాటు చేసుకుంటారు.  దీనికి తగ్గట్టుగానే సినిమా కథ నడుస్తుంది.  ఈ సంస్థ ఏం చేస్తుంది అన్నది తెరపై చూపించారు.  అయితే, హీరో ఆచార్య పేరుతో తనికెళ్ళ భరణి ఇంటికి వెళ్లిన తరువాత మాఫియా నాయకుడు రాజీవ్ కనకాలను ఎదిరించే సంఘటనలు సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తాయి.  ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ లో సినిమా కొంత ఆసక్తిని రేకెత్తించింది.  అయితే, క్లైమాక్స్ సహజత్వం లేకుండా నాటకీయంగా ఉండటంతో ప్రేక్షకుడు కొంత అసహనానికి లోనవ్వాల్సి వస్తుంది.  

నటీనటుల పనితీరు: 

కళ్యాణ్ రామ్, మెహరీన్ పాత్రలు సినిమాకు కీలకం అని చెప్పాలి.  ఇద్దరు పాత్రలకు తగినట్టుగా చక్కగా నటించారు.  ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ పరిణితి కనబరిచారు.  ఇక మెహరీన్ ఒదిగిపోయి నటించింది.  ఈ రెండు పాత్రలు సినిమాకు హైలైట్ గా మారాయి.  వెన్నెల కిషోర్ సినిమాకు మెయిన్ సపోర్ట్ గా నిలిచారు.  మిగతా పాత్రలు వారి పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు.  

సంకేతిక వర్గం పనితీరు: 

శతమానం భవతి వంటి బెస్ట్ సినిమా తీసి జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న వేగేశ్న సతీష్ నుంచి వచ్చే సినిమాలు అన్ని కూడా అలానే ఉండాలని కోరుకోవడం సహజమే.  అయితే, ఈ సినిమా విషయంలో వేరే వాళ్ళ కథతో సినిమా కాబట్టి ఆయన కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు.  ఆ ఇబ్బందులు సినిమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఇక గోపిసుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది.  రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కళ్యాణ్ రామ్, మెహరీన్, మ్యూజిక్, కెమెరా, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు 

నెగెటివ్ పాయింట్స్: 

సాగతీత సన్నివేశాలు, ఎమోషన్స్, క్లైమాక్స్ 

చివరిగా : ఎమోషన్స్ ను అందుకోలేకపోయిన మంచివాడు