అదిరిపోయిన క్రిస్ గేల్ ఎంట్రీ.. మరో అరుదైన రికార్డు..!

అదిరిపోయిన క్రిస్ గేల్ ఎంట్రీ.. మరో అరుదైన రికార్డు..!

ఐపీఎల్ 2020లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అద్భుతంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన గేల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫుడ్‌ పాయిజన్ కారణంగా ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లపాటు బెంచ్‌కే పరిమితమైన గేల్.. ఆర్సీబీపై బరిలో దిగి అభిమానులను అలరించాడు. జనవరి తర్వాత తొలిసారి బ్యాట్ పట్టిన గేల్.. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నా.. ఐదు సిక్సులు, ఓ ఫోర్ బాది తనలో సత్తా తగ్గలేదని చాటాడు. 45 బంతుల్లో 53 రన్స్ చేసిన గేల్.. పంజాబ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా రనౌట్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్లతో అభిమానులను క్రిస్ గేల్ అలరించాడు. టీ20ల్లో అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. 13,349 రన్స్‌తో.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరొందాడు. కరేబియన్ క్రికెట్ దిగ్గజం బౌండరీల ద్వారానే పది వేల పరుగుల్ని పూర్తి చేయడం విశేషం. టీ20ల్లో గేల్ 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. ప్రస్తుతం గేల్ కాకుండా కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ టీ20ల్లో పది వేలకుపైగా పరుగులు చేశారు. కరేబియన్ సూపర్ స్టార్‌కి క్రికెట్ అంటే ప్రాణం. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ నుంచి బయటపడ్డ ఆయన.. 2005 హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో ఊపిరి ఆడక అవస్థలు పడ్డాడు. గ్రౌండ్‌ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి అక్కడ సర్జరీ చేయించుకుని బతికాడు. దాన్ని మరోసారి గుర్తుచేసుకున్న కరీబియన్ క్రికెటర్.. అప్పటి నుంచే తనకు జీవితాన్ని మరోలా చూడటం అలవాటైందన్నాడు. గతంతోనే తాను చావును మోసం చేశానని అంటాడు కరీబియన్ డేరింగ్ క్రికెటర్ క్రిస్‌గేల్. అందుకే, ఎవరికీ భయపడనని చెబుతున్నాడు. జీవితంలో ప్రతీక్షణాన్నీ ఎంజాయ్ చేయడానికే  బతికి ఉన్నానన్న డాషింగ్ క్రికెటర్ ... కనీసం 50 ఏళ్లు వచ్చేదాకా క్రికెట్ ఆడతానని అంటున్నాడు.