రివ్యూ: ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా 

రివ్యూ: ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా 

నటీనటులు: సోనమ్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌, రెజీనా, జూహీ చావ్లా, రాజ్‌కుమార్ ‌రావు, అక్షయ్‌ ఒబెరాయ్‌ తదితరులు

సంగీతం: రోచక్‌ కోహ్లీ

సినిమాటోగ్రఫీ: హిమన్‌ ధమీజా, రంగరాజన్‌ రాంభద్రన్‌

నిర్మాణ సంస్థ: వినోద్‌ చోప్రా ఫిలింస్‌

దర్శకత్వం: షెల్లీ చోప్రా ధర్‌

వీరే ది వెడ్డింగ్ సినిమా సూపర్ హిట్ తరువాత సోనమ్ కపూర్ చేస్తున్న సినిమా ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా.  1942 ఏ లవ్ స్టోరీ అనే సినిమాలోని పాటను టైటిల్ గా తీసుకున్నారు.  రియల్ లైఫ్ లో తండ్రి కూతుర్లుగా ఉన్న అనిల్ కపూర్, సోనమ్ కపూర్ లు మొదటిసారి రీల్ లైఫ్ లో తండ్రి కూతుర్లుగా కనిపిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజైన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.  

కథ: 

సోనమ్ కపూర్ తన పెళ్లిని ఓ వేడుకలా చేసుకోవాలని అనుకుంటుంది.  అలా కలలు కంటూ పెరిగి పెద్దదౌతుంది సోనమ్.  సోనమ్ కు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేయాలని అనుకుంటారు తండ్రి అనిల్ కపూర్, కొడుకు అక్షయ్ ఒబెరాయ్ లు.  ఇంట్లో అందరు సోనమ్ పెళ్లి చేయాలని అనుకుంటారు.  ఈ విషయాన్ని మాత్రం సోనమ్ కు చెప్పరు.  ఆమె అభిప్రాయం ఏంటి అనే విషయం కూడా కనుక్కోరు.  ఇదే సమయంలో సోనమ్ కు రాజ్ కుమార్ రావుతో పరిచయం ఏర్పడుతుంది.  ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.  వీరి ప్రేమకు ఇంట్లో వారు కూడా సమ్మతిస్తారు.  ఈలోపు సోనమ్ కపూర్ తనలో దాచుకున్న ఓ నిజాన్ని బయటకు చెప్పాలని అనుకుంటుంది.  అందరికి చెప్తే ఏమౌతుందో అని చెప్పి తనకు కాబోయే భర్త రాజ్ కుమార్ రావుకు విషయాన్ని చెప్తుంది.  సోనమ్ చెప్పిన రహస్యం ఏంటి..? సోనమ్.. రాజ్ కుమార్ రావు ల వివాహం జరిగిందా లేదా అన్నాయి మిగతా సినిమా.  

విశ్లేషణ: 

సినిమా స్వలింగ సంపర్గం అనే అంశంతో సినిమా కథను తయారు చేసుకున్నారు దర్శకురాలు షెల్లీ చోప్రా.  సోనమ్ కపూర్ లాంటి నటిని అలాంటి క్యారెక్టర్ కు ఒప్పించడం అంటే మాములు విషయం కాదు.  సాహసంతో కూడుకున్న పాత్రే అని చెప్పాలి.  ప్రపంచంలో ఎల్.జి.బి.టి ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అభినందనీయం.  ఇందులోని ప్రతి సన్నివేశం అందరిని ఆలోచింపజేస్తుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.  కొన్నిచోట్ల సాగదీసినట్టుగా అనిపిస్తుంది.  సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది.  మరోసారి రాజ్ కుమార్ రావు తన యాక్టింగ్ తో అదరగొట్టాడనే చెప్పాలి.  సోనమ్ పాత్ర సినిమాకు ప్రాణం పోసింది.  

నటీనటుల పనితీరు: 

అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  సోనమ్ తనలోని వేదనను, బాధను బయటకు చెప్పే సమయంలో ఆమె హావభావాలు అద్భుతం అని చెప్పాలి.  అనిల్ కపూర్ టైమింగ్ కామెడీ, భావోద్వేగంతో కూడిన నటన అద్భుతం అని చెప్పాలి.  జూహీ కామెడీతో మెప్పించగా, రాజ్ కుమార్ రావు చాలా సహజంగా నటించి మెప్పించాడు.  సినిమాలో రెజీనా చిన్న పాత్ర చేసింది.  అయినప్పటికీ ఈ సినిమాకు ఆ పాత్ర ఎంతో కీలకంగా మారడం విశేషం.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకురాలు షెల్లీ చోప్రా  సున్నితమైన కథను చక్కగా తెరకెక్కించి మెప్పించింది.  ఎలాంటి కథలతో కూడిన సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి.  ఫొటోగ్రఫీ బాగుంది.  బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

సాంగ్స్ 

మ్యూజిక్ 

కాన్సెప్ట్ 

మైనస్ పాయింట్స్: 

ఫస్ట్ హాఫ్ లో కొంత సాగతీత 

చివరిగా: లవ్ స్టోరీలో ఇదో విచిత్రం