బెదిరిస్తే సహించం...ఎడిటర్స్‌ గిల్డ్‌

బెదిరిస్తే సహించం...ఎడిటర్స్‌ గిల్డ్‌

రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలో మీడియాపై అటార్నీ జనరల్‌ చేసిన వ్యాఖ్యలను ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండించింది. ద హిందూతో పాటు ఇతర సంస్థలపై చర్యలు తీసుకుంటామని కోర్టులో నిన్న అటార్నీ జనరల్‌ కే వేణుగోపాల్‌ అనడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఇవాళ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. దొంగలించిన పత్రాల ఆధారంగా వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలంటూ నిన్న సుప్రీంలో వాదించిన అటార్నీ జనరల్‌... రక్షణ శాఖ పత్రాలను దొంగలించినవారిపై అధికార రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని అన్నారని గిల్డ్‌ పేర్కొంది. తరవాత మీడియాపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని వేణుగోపాల్‌ చెప్పినా... ఆయన వైఖరి ఆందోళనకరంగా ఉందని గిల్డ్‌ పేర్కొంది. మీడియాను బెదిరించడం, ముఖ్యంగా రఫేల్‌ కేసు విషయంలో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతోందని గిల్డ్‌ ఆరోపించింది. తమ ఆధారాలను వెల్లడించాల్సిందిగా ఒత్తిడి చేస్తూ అధికార రహస్యాల చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే... తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని గిల్డ్‌ స్పష్టం చేసింది.