సుజనా చౌదరికి ఈడీ సమన్లు

సుజనా చౌదరికి ఈడీ సమన్లు

టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్‌, ఢిల్లీలోని సుజనా చౌదరి నివాసాలు, కార్యాలయాల్లో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేశారు. అనంతరం ఆయనకు నోటీసులు జారీచేశారు. సుజనా చౌదరికి 120 షెల్ కంపెనీలు ఉన్నట్టు ఈడీ ప్రకటించింది. సుజనా గ్రూప్‌ కంపెనీలు బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగ్గొట్టాయని ఈడీ తెలిపింది. సుజనా చౌదరికి చెందిన ఆరు ఖరీదైన కార్లను ఈడీ జప్తు చేయడం జరిగింది.

అదంతా దుష్ప్రచారం: సుజనా గ్రూప్

సుజనా గ్రూప్ డైరెక్టర్లపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయన్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని సుజనా గ్రూప్ మీడియా ప్రకటనలో స్పష్టం చేసింది. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు తెలిపింది. సుజనా గ్రూప్ విడుదల చేసిన మీడియా ప్రకటన ఇలా ఉంది.

'10 సంవత్సరాల నాటి ఒక శోధనలో భాగంగా సుజనా గ్రూప్ నుంచి కొంత సమాచారాన్ని పొందేందుకు చెన్నై నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చారు. వారికి కావలసిన సమాచారాన్ని సుజనా సంస్థలు సక్రమంగా సక్రమంగా అందించాయి. వాస్తవాలు ఇలా ఉండగా సుజనా గ్రూప్ లోని డైరెక్టర్లపై లుకౌట్ నోటీసు జారీ చేశారని దుష్ప్రచారం జరుగుతున్నది. దీన్ని సుజనా సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అదేవిధంగా మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వాస్తవాలు కాదు. వ్యాపార నియమాలకు లోబడి జరిగిన పరిణామాలకు ఇతర దురుద్దేశపూరిత సమాచారాన్ని జోడించి సుజనా గ్రూపు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తున్నాము.'