కళ తప్పిన దసరా నవరాత్రులు

కళ తప్పిన దసరా నవరాత్రులు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కళ తప్పాయి. కరోనా కారణంగా భక్తుల సందడి అంతగా కనిపించలేదు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై తొలిరోజు అంతగా భక్తుల తాకిడి లేదు. ఈనెల 25 వ తేదీ వరకు దుర్గమ్మ తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. తొలిరోజు  స్వర్ణకవచాలంకృత  దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక ఉత్సవాల విషయానికి వస్తే కీలాద్రి శోభాయమానంగా వెలిగిపోయేది. కానీ ఈసారి ఆ శోభ కనిపించడం లేదు. ప్రతియేటా లక్షల సంఖ్యలో వచ్చేవారు. కానీ కోవిడ్‌ నిబంధనల వల్ల కొందరికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది.

అంటే గతంతో పోలిస్తే కేవలం 40 శాతం మంది మాత్రమే వస్తున్నారు. మరోవైపు రోజుకు పదివేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌ లైన్‌ టైమ్‌ స్లాట్‌ ప్రకారం దర్శనానికి రావాలి. అయితే ఇది తెలియని వారు గుడి వరకు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నారు. ఇటు మాస్క్‌ తప్పనిసరి చేశారు. అలాగే చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధుల్ని అనుమతించడం లేదు.  ఈ కారణాల వల్ల శరన్నవరాత్రి ఉత్సవాల్లో రద్దీ తగ్గిందని చెప్పవచ్చు