ఎట్టకేలకు దుర్గ గుడి ఈవో బదిలీ..

ఎట్టకేలకు దుర్గ గుడి ఈవో బదిలీ..

విజయవాడ దుర్గ గుడిలో అవకతవకలు, అక్రమాలకు కారకుడైన ఈఓ సురేష్ బాబు పై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. 2019లో దుర్గగుడికి ఈఓగా సురేష్ బాబు వచ్చినప్పటి నుంచి ఆలయంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటికి పరాకాష్టగా ఏసీబీ, విజిలెన్స్ దాడుల్లో ఈఓ సురేష్ బాబు పాత్ర ఉన్నట్లు తేలింది. అయితే ఏసీబీ దాడులు జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఈఓ పై చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈఓ అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం కావడంతో ఆయన పై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవస్థానంలో ఉన్న అన్ని విభాగాల్లో అంటే చీరలు, శానిటేషన్, శానిటరీ, స్టోర్స్, అన్నదానం ఇలా అన్ని విభాగాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి.

 ఈఓ సురేష్ బాబు పై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం కీలకంగా మారింది. ఫిబ్రవరి నెలలో ఏసీబీ మూడు రోజుల పాటు దుర్గగుడిలో చేసిన తనిఖీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఏసీబీ బృందాలు దుర్గగుడిలో ఉన్న అన్ని విభాగాలను జల్లెడ పట్టాయి. అన్ని విభాగాల్లో అవకతవకలపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందించిన ఏసీబీ వీటన్నింటికి ప్రధాన కారణంగా ఈఓ సురేష్ బాబు అని తేల్చింది. ఏసీబీ నివేదికలో ఈఓ తప్పిదాలను స్పష్టంగా పొందుపరిచింది. ఇక గత నాలుగు రోజులుగా ఈఓ అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో ప్రభుత్వం స్పందించి ఈఓ సురేష్ బాబు పై బదిలీ వేటు వేసింది. అయితే ఆయనను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఆలయ కొత్త ఈఓ గా రాజమండ్రి ఆర్జేసీ 2 భ్రమరాంబ కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.