టీఆర్ఎస్ కు దుబ్బాక నేర్పిన పాఠాలు ఏంటి ?

టీఆర్ఎస్ కు దుబ్బాక నేర్పిన పాఠాలు ఏంటి ?

టీఆర్‌ఎస్‌కు దుబ్బాక నేర్పిన పాఠాలు ఏంటి? అక్కడ చేసిన మూడు ప్రధాన తప్పులు GHMC ఎన్నికల్లో రిపీట్‌ చేయకూడదని భావిస్తున్నారా? గులాబీ దళపతి దూకుడుకు అదే కారణమా? గ్రేటర్‌లో రణతంత్రం మార్చేశారా? 

డివిజన్ల స్థాయిలోనే ఎన్నికల రణతంత్రం!

దుబ్బాకలో సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన తర్వాత కీలకమైన GHMC ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యూహం మార్చింది. మహా వేగంతో సాగుతున్న ఈ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది అధికార పార్టీ. అభ్యర్థుల ఎంపిక నుంచి.. వారి గెలుపు వరకు డివిజన్ల స్థాయిలోనే ఎన్నికల  రణతంత్రం రచించింది.  ఈ సందర్భంగా దుబ్బాకలో చేసిన మూడు తప్పులను రిపీట్‌ చేయకూడదన్న ఆలోచనతో టీఆర్‌ఎస్‌ ముందుకెళ్తోందన్న సమాచారం పార్టీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోందట. 

ఆ మూడు తప్పులు ఇక్కడ రిపీట్‌ కాకుండా..!

దుబ్బాకలో అభ్యర్థి ఎంపిక వీక్‌గా ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ నిర్వహించిన  సమీక్షలో తేలిందట. అలాగే  గులాబీ దళపతి స్వయంగా పూనుకోకపోవడం.. సభలు నిర్వహించకపోవడం.. ప్రచారం చేయకపోవడం పార్టీకి నష్టం చేకూర్చాయని గుర్తించారట. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రభావితం చేసేలా పార్టీ నేతలు చురుకుగా వ్యవహరించకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణంగా విశ్లేషించినట్టు సమాచారం. అందుకే GHMC ఎన్నికల్లో ఈ మూడు తప్పులను  రిపీట్‌ చేయకూడదని  నిర్ణయించారట కేసీఆర్‌. 

అనేక వడపోతల తర్వాతే అభ్యర్థుల ఎంపిక!

GHMCలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం మొత్తం సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో నడుస్తోందని టాక్‌. స్వయంగా ఆయనే పూనుకుని  నేతలను గైడ్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. దుబ్బాకలో చేసినట్టు కాకుండా కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు గులాబీ నేతలు. సిట్టింగ్‌ కార్పొరేటర్ల పనితీరు.. ఎవరిపై వ్యతిరేకత ఉంది.. మళ్లీ టికెట్‌ ఇస్తే గెలుస్తారా లేదా అన్న అంశాలపై అనేక సర్వేలు వడపోతలు జరిగాయట. మూడు విడతలుగా ప్రకటించిన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసినట్టు సమాచారం.

పక్కాగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ!

ఇక గెలుపు బాధ్యతలను కార్పొరేటర్లు, అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలపైనే వదిలేకుండా మంత్రులను, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులను రంగంలోకి దించారు సీఎం కేసీఆర్‌.  ఒక్కొక్కరికీ ఒక్కో డివిజన్‌ అప్పగించారు. ఆయా డివిజన్లలోని ప్రతిఒక్క ఒటరును కలిసేలా  ప్రచార ప్రణాళిక రచించారు గులాబీ దళపతి. పోల్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా ఉండేలా  నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారసభ కూడా ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలతోపాటు ప్రచారం చివరి సమయంలో కేసీఆర్ సభ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. 

దుబ్బాకకు గ్రేటర్‌ పోరు వ్యూహానికి పొంతనే లేదా? 

GHMC ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్‌ తీసుకుంటున్న ఈ చర్యలు చూసిన తర్వాత ఎన్నికల వ్యూహం పూర్తిగా మార్చేసినట్టే కనిపిస్తోంది. దుబ్బాకకు GHMC ఎన్నికలకు పొంతనే లేనట్టు గులాబీ సైన్యం కదులుతోందట. మరి.. మారిన ప్లానింగ్‌ గ్రేటర్‌ వార్‌లో ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.