వెంకీ మామ చేతికి 'డ్రైవింగ్ లైసెన్స్'!

వెంకీ మామ చేతికి 'డ్రైవింగ్ లైసెన్స్'!

విక్టరీ వెంకటేశ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. విశేషం ఏమంటే... ఆయన స్ట్రయిట్ సినిమాలకంటే ఇప్పుడు ఎక్కువగా రీమేక్స్ పైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే సెట్స్ పై రీమేక్ చిత్రాలు 'నారప్ప', 'దృశ్యం -2' ఉండగా, ముచ్చటగా మూడో రీమేక్ పై వెంకీ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఆయన చేస్తున్న వాటిల్లో 'నారప్ప' తమిళ 'అసురన్'కు రీమేక్ కాగా, 'దృశ్యం -2' మలయాళ చిత్రం. అయితే.. ఇప్పుడు మరో మలయాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 

ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొంతకాలం క్రితం కొందరు ప్రయత్నించారు. కానీ ఇప్పటికే 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ 'డ్రైవింగ్ లైసెన్స్'పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండు సినిమాల కథా వస్తువులూ ఒక హోదాలో ఉన్న వ్యక్తుల ఇగో క్లాషెస్ ప్రధానంగా సాగుతాయి. కాబట్టి... ఒకే తరహా చిత్రాలనే భావన చూసే ప్రేక్షకులకు కలుగుతుంది. కథ పరంగా చూస్తే 'డ్రైవింగ్ లైసెన్స్'లోనే డ్రామా ఎక్కువ ఉంటుంది. తాను అభిమానించే హీరోతో  ఓ ఆర్.టి.ఎ. ఆఫీసర్ ఊహించని విధంగా వృత్తి రీత్యా తలపడాల్సి వస్తుంది. హీరో - అతని ఫ్యాన్ మధ్య క్లాష్ తో సాగే ఈ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్టీఏ అధికారి, అభిమాని పాత్రను వెంకటేశ్ పోషిస్తుంటే, సదరు హీరో పాత్రను వరుణ్‌ తేజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మలయాళంలో ఈ రెండు పాత్రలను సూరజ్, పృథ్వీరాజ్ చేశారు. ఒకవేళ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ లో వెంకీ, వరుణ్ తేజ్ వార్త నిజమే అయితే మాత్రం ఇది వీరిద్దరి కాంబినేషన్ లో 'ఎఫ్ 2, ఎఫ్ 3' తర్వాత వచ్చే మూడో చిత్రం అవుతుంది. సో... ఈ క్రేజీ కాంబినేషన్ కారణంగా 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ పై అంచనాలు పెరగడం ఖాయం.