పవన్ ట్వీట్లపై టీడీపీ స్పందన ఇది?

పవన్ ట్వీట్లపై టీడీపీ స్పందన ఇది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్లపై స్పందించొద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించింది... తనపై నిరవధికంగా కుట్ర జరుగుతోందని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే... రాంగోపాల్ వర్మ, మంత్రి నారా లోకేష్, అతని స్నేహితుడు... ఇతరులతో కలిసి తనపై కుట్ర చేశారని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ సెక్రటేరియట్‌ను వేదికగా చేసుకుని తనపై ఆరు నెలలుగా ఈ కుట్ర సాగుతోందని మండిపడ్డారు పవన్... కొన్ని మీడియా సంస్థలతో కలిసి, తనపై, తన కుటుంబంపై, తన అభిమానులపై నిరవధికంగా అత్యాచారం జరుపుతున్నారని పవన్ కల్యాణ్‌ తన ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీక్ష చేస్తున్న సమయంలో పవన్ ట్వీట్లపై స్పందించొద్దని ఆదేశించింది టీడీపీ అధిష్టానం. ఆంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు దిగారు.... ఆయన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేపట్టారు. అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్ ట్వీట్లపై స్పందిస్తే దీక్ష పక్కదారి పడుతుందని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌కు రాజకీయాలను ఆపాదించడమే అతిపెద్ద రాజకీయమని అభిప్రాయపడుతోన్న తెలుగుదేశం పార్టీ... చంద్రబాబు దీక్ష సమయంలో ఈ తరహా రాజకీయానికి తెరలేపడం కుట్రలో భాగమే అని భావిస్తోంది టీడీపీ.