టెక్కలి వైసీపీలో రాజుకున్న ఆధిపత్య రగడ?

టెక్కలి వైసీపీలో రాజుకున్న ఆధిపత్య రగడ?

టెక్కలి వైసీపీలో ఆధిపత్య రగడ మళ్లీ రాజుకుందా? సమసిపోయిందని అనుకున్న సమస్య  మొదటికొచ్చిందా? టెక్కలిలో ఢక్కామొక్కీలు తిన్నా పాఠాలు నేర్వని నేతలు ఎవరు? ప్రస్తుత గొడవపై పార్టీ పెద్దల స్పందనేంటి? 

ఎవరికి వారే వర్గపోరు తెర!

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడుకు చెక్‌ పెట్టేందుకు 2019లో వైసీపీ త్రిముఖ వ్యూహం పన్నింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిలక్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. కానీ.. వైసీపీ నాయకుల ఆధిపత్య పోరు ఫలితంగా  అక్కడ వైసీపీ వ్యూహం ఫలించలేదు. శ్రీకాకుళం లోక్‌సభలో దువ్వాడ శ్రీనివాస్‌ను, టెక్కలి అసెంబ్లీలో పేరాడ తిలక్‌ను బరిలో దించినా ఆశించిన ఫలితం రాలేదు. పోనీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. నేతలు కలిసి ఉన్నారా అంటే అదీ లేదు. ఎవరికి వారే వర్గపోరుకు తెరతీశారు. 

క్షేత్రస్థాయిలో పార్టీ పెద్దలు ఆశించినట్టు లేదా? 

ఇలా అయితే అచ్చెన్నను కట్టడి చేయలేమని భావించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. టెక్కలి వైసీపీ బాధ్యతలు తీసుకుని ఎవరేం చేయాలో స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా చేశారు.  పేరాడ తిలక్‌ను కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ను చేశారు. ఇలా పదవుల పంపకం చేపట్టడంతో అంతా సర్దుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని వైసీపీ పెద్దలు భావించారు. కానీ.. క్షేత్రస్థాయిలో మరొకటి జరగడంతో మళ్లీ రగడ మొదలైంది. 

తిలక్‌ ఏర్పాటు చేసిన సభకు దువ్వాడకు ఆహ్వానం లేదు? 

టెక్కలి వైసీపీ  ఇంఛార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ దూకుడుగా వెళ్తే తమకు ఉనికి ఉండదని భావించారో ఏమో  కిల్లి కృపారాణి, పేరాడ తిలక్  లోకల్‌ పాలిటిక్స్‌కు తెరశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.  కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసే ఉద్దేశంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పేరాడ తిలక్‌. ఈ సభకు అందరినీ ఆహ్వానించారు కానీ.. దువ్వాడకు చెప్పకుండా ఆయన్ని పక్కన పెట్టేశారట.  ఈ విషయం తెలిసిన వెంటనే నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారట దువ్వాడ. అక్కడ నుంచి ఈ పంచాయితీ ఎంపీ విజయసాయిరెడ్డికి  దగ్గరకు చేరినట్టు సమాచారం. 

టెక్కలి వైసీపీ నాయకులకు విజయసాయిరెడ్డి క్లాస్‌!

ఇక లాభం లేదనుకున్న  ఎంపీ విజయసాయిరెడ్డి.. వైసీపీ నేతలు కృపారాణి, పేరాడ తిలక్‌తోపాటు.. డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ను కూడా పిలిచి అందరికీ క్లాస్‌ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా దాసన్న కొంత అసహనం వ్యక్తం చేశారట. తాను నరసన్నపేట కంటే టెక్కలిపై ప్రత్యేక దృష్టి  పెట్టి అందరినీ ఓ తాటిపైకి తెచ్చేందుకు  ప్రయత్నిస్తుంటే.. మధ్యలో ఈ పంచాయితీలేంటని టెక్కలి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. 

టెక్కలి పంచాయితీపై మళ్లీ పార్టీలో చర్చ!

మొత్తానికి తిలక్‌ ఏర్పాటు చేసిన సభ అర్థాంతరంగా వాయిదా పడింది. టెక్కలి పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడాదిన్నరగా కళింగ త్రయానికి ఎంత నచ్చ జెప్పినా దారికి రాకపోవడంతో ఇకపై కఠిన చర్యలు తప్పవనే టాక్‌ నడుస్తోంది. అధిష్ఠానం కూడా ఇక్కడి నేతల తీరుపై విసుగుపోయినట్టు చెబుతున్నారు. మరి.. ఈ ఆధిపత్యపోరుకు ఎలాంటి పరిష్కారం కనుగొంటారో చూడాలి.