50 వేల మెజారితో గెలిచి చరిత్ర సృష్టించినా ఆ ఎమ్మెల్యేకి గుర్తింపులేదా?

50 వేల మెజారితో గెలిచి చరిత్ర సృష్టించినా ఆ ఎమ్మెల్యేకి గుర్తింపులేదా?

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. దాదాపు 50వేల మెజారిటీతో ఎన్నికల్లో గెలిచారు. ఇంకేముందీ చక్రం తిప్పేద్దామనుకున్నారు. కానీ ఏం లాభం.. కేడర్‌ కూడా పట్టించుకోవడం లేదట. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడాదిన్నరగా తెగ ఫీలవుతున్నారట సదరు ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా నేత? 

ఎమ్మెల్యేగా ఎన్నికైన సంతోషం త్వరగానే ఆవిరైందా? 

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. చిత్తూరు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా చర్చల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఓడినా.. 2019లో పుంజుకోవడంతో ఆయన అందరి దృష్టినీ ఆకరించారు. భారీ మెజారిటీ రావడంతో పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని.. అంతా తనదగ్గరకే వస్తారని అనుకున్నారట. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో కాస్త ఫర్వాలేదని అనిపించినా.. ఆ సంతోషం ఆవిరి అవడానికి ఆదిమూలానికి ఎంతో సమయం పట్టలేదని టాక్‌. 

పనుల కోసం ఎమ్మెల్యేను కాదని మంత్రుల దగ్గరకు కేడర్‌ క్యూ!

సత్యవేడులో ఆదిమూలం ఎంత కలుపుకొని వెళ్దామని భావించినా.. కేడర్‌ మాత్రం దూరం దూరం అని పక్కకు జరుగుతోందట. పైగా తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. ఏ పని కావాల్సి వచ్చినా కార్యకర్తలు ఎవరూ రావడం లేదట. ఇది చేసిపెట్టండి అని అడిగేవారే లేరట. సత్యవేడులో ఏ పని జరగాలన్నా.. ఏం కావాలన్నా.. పార్టీ వారంతా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్తున్నారట. అందుకే ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

సత్యవేడులో మంత్రులకు భారీగా అనుచరగణం

మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డిలకు సత్యవేడుపై మంచి పట్టు ఉంది. గతంలో నారాయణస్వామి సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు కూడా. ఆ విధంగా ఆయన అనుచరగణం ఇక్కడ పెద్దసంఖ్యలోనే కొనసాగుతోంది. గత ఎన్నికల్లోనూ జీడీ నెల్లూరు నుంచి కాకుండా సత్యవేడు నుంచే నారాయణస్వామి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇక మంత్రి పెద్దిరెడ్డికి కూడా ఇక్కడ అనుచరులకు కొదవలేదు. ఆ కారణంగానే పార్టీ కేడర్‌ ఏ పనికావాలన్నా లోకల్‌ ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కాదని మంత్రుల దగ్గరకు వెళ్తున్నారట. 

నామినేటెడ్‌ పదవుల్లోనూ మంత్రుల అనుచరులకే చోటు!

సత్యవేడులో కీలకంగా భావించే సురుటుపల్లె పల్లికొండేశ్వర ఆలయం చైర్మన్‌ పదవి కోసం ఎమ్మెల్యే వర్గం తెగ ట్రై చేసింది. కానీ ఆలయ చైర్మన్‌ పదవి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన మునిశేఖర్‌రెడ్డికి దక్కింది. ఇదొక్కటే కాదు.. నియోజకవర్గంలో చాలా పదవులు  మంత్రుల మనుషులనే వరించాయట. చివరకు ఇసుక నుంచి రోడ్డు పనుల వరకూ వేటిల్లోనూ ఎమ్మెల్యే అనుచరులకు చోటు దక్కలేదట.  దీంతో ఎమ్మెల్యే మింగలేక.. కక్కలేక ఉన్నట్టు సమాచారం. మా సంగతి ఏంటన్నా? అని సొంత అనుచరులు అడుగుతుంటే ఆదిమూలం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారట. అటు మంత్రులకు ఎదురు తిరగలేక.. ఇటు పార్టీ పెద్దలకు చెబితే ఏమౌతుందో అని మిన్నకుండి తనలో తానే కుమిలిపోతున్నారట ఎమ్మెల్యే. మరి.. ఈ సమస్యకు ఎలాంటి ఎండ్‌ కార్డ్‌ పడుతుందో చూడాలి.