వైఎస్సార్‌పై 4 సార్లు, సీఎం జగన్‌పై 2 సార్లు ఓడిపోయిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

వైఎస్సార్‌పై 4 సార్లు, సీఎం జగన్‌పై 2 సార్లు ఓడిపోయిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

అంతా అయిపోయిందనుకున్న దశలో ఎందుకు ఆగిందో ఆగిపోయింది. ఆరు నెలలు గడుస్తున్నా ఆహ్వానం లేదు. ఆయన రాకను అడ్డుకుంటున్నారో ఏమో కానీ.. చేరిక ఆలసమయ్యేలా ఎవరో పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో ఆయనకు రాజకీయాలపై వైరాగ్యమే వచ్చిందని టాక్‌. ఇంతకీ ఎవరాయన?

కడప జిల్లా పులివెందుల. వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఈ నియెజకవర్గంలో వైఎస్ కుటుంబంతోపాటు  టీడీపీ మాజీ నేత సతీష్‌రెడ్డికి అదేస్ధాయిలో గుర్తింపు ఉంది. వైఎస్‌ఆర్‌పై నాలుగుసార్లు,  జగన్‌పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా పులివెందులలో టీడీపీకి అండగా నిలబడుతూ వచ్చారు సతీష్‌రెడ్డి. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడ్డారు.  30 ఏళ్లుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు.

వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు!
ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నా ఆహ్వానం లేదా?

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరమైన తర్వాత తనకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.  ఇదే సమయంలో వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీ కోసం సర్వం ధారపోసిన తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలు చేశారు. దాంతో సతీష్‌రెడ్డి వైసీపీల చేరడం లాంఛనమే అన్న ప్రచారం జరిగింది. ముహూర్తం కూడా ఫిక్స్‌ అయిందని అనుకున్నారు.  కానీ.. అధికార పార్టీ నుంచి ఆహ్వానం లేదు. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా.. కరోనా వ్యాప్తితో అంతా అస్తవ్యస్తమైందని అనుకుంటున్నారు. 

వైసీపీలో చేరికపై కొందరు నేతలు అడ్డుకుంటున్నారా? 

అయితే ఎక్కడో లింక్‌ మిస్‌ అయింది.  ఆరు నెలలు గడుస్తున్నా ఎలాంటి సానుకూల సంకేతాలు అందలేదు.  పైగా సతీష్‌రెడ్డి చేరికపై స్థానికంగా కొందరు నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో బ్రేక్‌ పడిందట. దీంతో 30 ఏళ్లుగా నియోజకవర్గంలో తనకంటూ ఉన్న ఓ వర్గాన్ని, గుర్తింపును సతీష్‌రెడ్డి కోల్పోతూ వచ్చారు. టీడీపీకి దూరం కావడంతో ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు మొహం చాటేస్తూ వచ్చారు. ఇటు అధికార పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారు కూడా స్పందించడం లేదట. 

వ్యవసాయ పనుల్లో బిజీ అయిన సతీష్‌రెడ్డి!

ఈ పరిణామాలతో సతీష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. రాజకీయాలను వదిలేసి గత మూడు నెలలుగా కొత్త వ్యాపకం చూసుకున్నారట.  తన వ్యవసాయ క్షేత్రం అభివృద్ధిపై దృష్టి పెట్టారు సతీష్‌రెడ్డి. పశుపోషణ కూడా చేపట్టారు. 30 ఏళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎక్కువ సమయం వ్యవసాయం, పశుపోషణపై ఫోకస్‌ పెడుతున్నారు. సువిశాల వ్యవసాయ క్షేత్రంలో పంటలసాగు నుంచి కలుపు తీసే పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజకీయాలంటే వైరాగ్యం వచ్చిందో.. వైసీపీలో చేరడంపై డౌట్‌ పట్టుకుందో కానీ.. తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్తిపోతున్నారు.