బెజవాడ దివ్య హత్య కేసు దిశ పోలీసులకు బదిలీ

బెజవాడ దివ్య హత్య కేసు దిశ పోలీసులకు బదిలీ

ఏపీలో కలకలం రేపిన బెజవాడ దివ్య హత్య కేసు దిశ పోలీసులకు బదిలీ అయ్యింది. ఆధారాలు సేకరించే పనిలో పడ్డ దిశ పోలీసులు... పోస్ట్‌మార్టం, RFSL రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య హత్య కేసులో నిజానిజాలు వెలికి తీసే పనిలో పడ్డారు పోలీసులు. మాచవరం పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టగా.. దాన్ని దిశ స్టేషనుకు బదిలీ చేశారు. కేసులో దర్యాప్తు వేగవంతమయ్యేందుకు నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేయడం తప్పనిసరి.

అయితే, నాగేంద్రకు మరో రెండు రోజులు చికిత్స అవసరమంటున్నారు వైద్యులు. నాగేంద్రకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ హోం మినిస్టర్‌ సుచరిత. ఇప్పటికే దివ్వ తల్లిదండ్రుల నుంచి సమాచారం సేకరించారు పోలీసులు. తమ కుమార్తెను చంపిన నాగేంద్రను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఇంట్లో నిద్రిస్తున్న దివ్యను కిరాతకంగా చంపాడని, ప్రేమ పెళ్ళి అవాస్తవాలన్నారు.

మరోవైపు.. నాగేంద్ర చెబుతున్నదానికి, దివ్య తల్లిదండ్రుల వాదనకు పొంతన కుదరట్లేదు. అసలు పెళ్లే కాలేదని దివ్య తల్లిదండ్రులు చెబుతుండగా... ఏడాది క్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నామని నాగేంద్ర చెబుతున్నాడు. ఈ రెండింటిలో ఏది నిజమో తేల్చనున్నారు పోలీసులు. ఇందుకోసం ఫోరెన్సిక్ సాయం కూడా తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు నిజమో కావో తేల్చనున్నారు.