అంబటికి సొంతపార్టీలోనే అసమ్మతి.. ఆ... విభేదాల వల్లేనా ?

అంబటికి సొంతపార్టీలోనే అసమ్మతి.. ఆ... విభేదాల వల్లేనా ?

అధికారపక్షంలోనే ప్రతిపక్షం తయారవుతోందా? ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారా? అక్రమాలు జరిగాయంటూ ఏకంగా కోర్టు తలుపులనే తట్టడం దేనికి సంకేతం?  గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ అంశం అధికార పార్టీలో కలకలం రేపుతోంది.

అంబటికి సొంతపార్టీలోనే అసమ్మతి వర్గం!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని వైసీపీకి చెందిన నాయకులు కోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన  ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  సత్తెనపల్లిలో మొదటి నుంచి అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. అయినా వాటిని పట్టించుకోకుండా సీఎం జగన్‌.. మొన్నటి ఎన్నికల్లో  అంబటికి టికెట్‌ ఇచ్చారు. ఇలా సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఓ సామాజికవర్గం నాయకులు ఏకంగా జగన్‌ దగ్గర పంచాయితీ కూడా పెట్టారు. అయితే అప్పటికే నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి వెనక్కి వెళ్లేది లేదని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో అంబటి రాంబాబు విజయం సాధించారు.

సర్వే నెంబర్లు 358/48ఎ, 384/2, 412, 413, 414లో లైమ్‌స్టోన్‌ తవ్వకాలు!

ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అయింది. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వర్గం యాక్టివ్‌ అయింది. మైనింగ్‌ వ్యవహారంలో అంబటి ఆయన అనుచరులపై అసమ్మతి నేతలు ఏకంగా కోర్టు తలుపు ట్టారు.  నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కొటనెమలిపురి, కుబ్బాద్పురం గ్రామాల మధ్య సర్వే నెంబర్లు  358/48ఎ, 384/2, 412, 413, 414 సమీపంలో ప్రభుత్వానికి చెందిన భూముల్లో అంబటి రాంబాబు ఆయన అనుచరులు భవనాసి నరసింహరావు, నెల్లూరి మదుబాబు, మౌలాలి, రేణుకస్వామి, రామిరెడ్డి, సాంబశివారెడ్డి, రాంబాబు అక్రమంగా లైమ్ స్టోన్ తవ్వకాలు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.  

వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకొన్న పిల్‌ వేసిన శ్రీనివాసరెడ్డి, రామయ్య!

రాజుపాలేనికి చెందిన పుప్పుల శ్రీనివాసరెడ్డి, కొండమోడుకు చెందిన నల్లగొర్ల రామయ్యలు హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు గనుల శాఖను నివేదిక కూడా కోరింది. ఈ వివాదానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు కాపీలను కూడా కోర్టు ముందు ఉంచాలని  హోంశాఖను ఆదేశించింది న్యాయస్థానం. విచారణ వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా పడింది. పిల్‌ వేసిన శ్రీనివాసరెడ్డి, రామయ్యలు తాము వైసీపీ కార్యకర్తలమని కోర్టుకు తెలపడం విశేషం. ఇందులో రాజకీయ కోణం ఉందని కోర్టు అనుమానం వ్యక్తం చేయడంతో.. రాజకీయ కోణం ఉంటే తాము వైసీపీ నేతలుగా చెప్పేవారం కాదని వివరించారు.

మైనింగ్‌ వ్యవహారాలు, టెండర్లలో అంబటి పేరు లేదంటున్న అనుచరులు!

ఈ వివాదంపై ప్రస్తుతం అంబటి వర్గం ప్రత్యేకంగా దృష్టి సారించింది.  ఇందులో రాజకీయ కోణం స్పష్టంగా ఉందని.. గతంలో అంబటికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో   పిటిషనర్లు పాల్గొన్న పొటోలు, వీడియోలు సిద్ధం చేసుకుంటున్నారట. అంతేకాదు.. మైనింగ్‌ వ్యాపారపరమైన అంశం... దీనికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. అలాంటిదాంట్లో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం ఉండబోదని అంబటి వర్గం వాదిస్తోందట. ఇప్పటి వరకూ అంబటికి కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. అలాగే మైనింగ్‌ వ్యవహారాల్లో పాల్గొన్నట్లుగా, టెండర్లు వేసినట్లుగా ఎక్కడా అంబటి పేరు లేదని చెబుతున్నారట. అందుకే ఇది రాజకీయ కోణంలో జరుగుతున్న అంశంగా వారు వాదిస్తున్నారు.

సత్తెనపల్లి, గురజాలలో వేర్వేరుగా టెండర్లు!

సత్తెనపల్లిలో జరుగుతోన్న మైనింగ్‌లో ఆధిపత్య పోరు కూడా ఉంది. గతంలో టీడీపీ హయాంలో ఒకే వర్గానికి చెందిన నేతలు సత్తెనపల్లి, గురజాల సరిహద్దుల్లో మైనింగ్‌ నిర్వహించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి నియోజకవర్గంలో మైనింగ్‌ వారిదే అంటూ.. సత్తెనపల్లి, గురజాలలో వేర్వేరుగా టెండర్లు వేసుకున్నారు. ఈ సందర్భంగానే ఆధిపత్య పోరు మొదలైందనే ప్రచారం ఉంది. మరో శాసనసభ్యుడు సైతం ఇదే మైనింగ్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో సొంత పార్టీ నేతలు ఆయనతో విభేదించారట. మా నియోజకవర్గంలో మైనింగ్‌ను మేమే చేసుకుంటామని.. పక్క నియోజకవర్గంలోని శాసనసభ్యుడికి సంబంధం ఏంటని ప్రశ్నించారట. ఇదే సమయంలో అంబటి కూడా సత్తెనపల్లి మైనింగ్‌ కాంట్రాక్టర్లకు వత్తసు పలకడంతో.. టార్గెట్‌ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

సిండికేట్‌లో వచ్చిన విభేదాల వల్లే కోర్టులో పిల్‌ వేశారా?

ఇప్పటి వరకూ మైనింగ్‌ చేసుకుంటున్న సిండికేట్‌లోని ఓ వ్యక్తి ఇటీవల చనిపోయాడు. అతని స్థానంలో మరొకరు మైనింగ్‌ బాధ్యతలు చేపట్టారు. అతను ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సిండికేట్‌లో విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కారణాలతో మైనింగ్‌ వ్యవహారంలో అంబటిని టార్గెట్‌ చేసి.. కోర్టులో పిల్‌ దాఖలు చేసే వరకూ విభేదాలు వెళ్లాయని అనుకుంటున్నారు. కాకపోతే ఇది కూడా అధికారపక్షంలోనే జరగడం ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పుకొంటున్నారట. ఈ అంశాన్ని పార్టీ సీనియర్ల వద్ద అంబటి ప్రస్తావించినట్లు సమాచారం. మైనింగ్‌ వ్యవహారాల్లోనే లేని అంబటిపై బురద చల్లే కార్యక్రమంగా ఆయన వర్గం కొట్టిపారేస్తోంది. మరి.. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.