వివాదాల రాముడు...

వివాదాల రాముడు...

వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు... వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట... నలుగురికి నచ్చిన దానిని వర్మ మెచ్చరు... ఆయనకు నచ్చిన దానిని పదిమంది మెచ్చేలా చేయడమే వర్మ బాణీ... ఇలా చిత్రవిచిత్రంగా సాగడంలోనే ఆనందం పొందుతున్నారు రామ్ గోపాల్ వర్మ...  రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! అవి లేకుంటే రాము లేడు, అవి ఉంటేనే వర్మ ఉంటాడు. ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం... ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతాడు... తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటాడు... వర్మలోని ఈ తెలివితేటలనూ అభినందించేవారు లేకపోలేదు...

ఆరంభంలోనే... అవార్డుల వెల్లువ...
'థింక్ అవుటాఫ్ ద బాక్స్' అన్నదే రామ్ గోపాల్ వర్మకు తెలిసిన విద్య. చదువు సంధ్యలకంటే వర్మ సమాజాన్ని చదవడం చిన్నతనం నుంచీ అలవాటు చేసుకున్నాడు. రష్యన్-అమెరికన్ రైటర్ అయాన్ ర్యాండ్ సిద్ధాంతాలంటే వర్మకు మంచి గురి. ఆమె రాసిన నవలలు చదివి, వాటిలోని సారాన్ని ఒంటపట్టించుకున్నాడు వర్మ. ఇక పాత కథనైనా అందుబాటులో ఉన్న మోడరన్ టెక్నాలజీతో అందంగా తెరకెక్కించాలని తపిస్తాడు. తొలి చిత్రం 'శివ'లోనే వర్మ తనదైన బాణీ పలికించాడు. అందువల్లే ఆ సినిమాతోనే ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా రెండు నందులను అందుకున్నాడు. ఇక ఇదే చిత్రం రీమేక్ తో బాలీవుడ్ నూ పలకరించి, పులకింప చేశాడు వర్మ. రెండో తెలుగు చిత్రం 'క్షణ క్షణం'తోనూ అలరించి, ఉత్తమ దర్శకునిగా మరో నందిని పట్టుకు పోయాడు. అదే చిత్రంతో బెస్ట్  స్క్రీన్ ప్లే రైటర్ గానూ ఇంకో నంది అందుకున్నాడు. నాగార్జున నిర్మించిన 'ప్రేమకథ'తో ఉత్తమ దర్శకునిగా మూడో నందినీ సొంతం చేసుకున్నాడు. ఇలా వర్మ ప్రతిభను చూసి, ఎందరో ఆయన అభిమానులుగా మారారు. వర్మకు కొన్ని జానర్స్ అంటేనే ఇష్టం. గ్యాంగ్ వార్స్ అన్నా, దెయ్యాలతో భయపెట్టడమన్నా వర్మకు మహా ఇష్టం. తరచూ ఈ రెండు జానర్స్ లోనే సినిమాలు తీస్తూ సాగాడు వర్మ. అయినా తన ప్రతి చిత్రంలోనూ వర్మ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడు. కథను అతను తెరకెక్కించే విధానానికి ఎంతోమంది ఫిదా అయిపోయి అభిమానులుగా మారారు. వర్మ స్ఫూర్తితోనే తెలుగునాట ఎంతోమంది దర్శకత్వంపై అభిమానం పెంచుకోవడం విశేషం. 

తీరే వేరు...
వర్మ ప్రతిభను చూసి బాలీవుడ్ జనం సైతం అప్రతిభులయ్యారు. అలాంటి వర్మ తెలుగులో తాను రూపొందించిన 'గోవిందా గోవిందా' చిత్రం విషయంలో అప్పటి ప్రాంతీయ సెన్సార్ ఆఫీసర్ అభిప్రాయాన్ని వర్మ వ్యతిరేకించాడు. ఆ తరువాత తెలుగు చిత్రాలు తీయననీ భీష్మించాడు. ఉత్తరాదిన వర్మ తీసిన చిత్రాలనే అనువాదం చేస్తూ తెలుగువారిని అలరించే ప్రయత్నం చేశాడు. హిందీలో వర్మ రూపొందించిన 'రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్' వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. అక్కడ వరుస పరాజయాలు పలకరించగానే మళ్ళీ మాతృభాషవైపు దృష్టి సారించాడు వర్మ. అయితే మునుపటి మ్యాజిక్ ప్రదర్శించలేకపోయాడు. దాంతో వివాదాలను ఆధారం చేసుకొని, తన తాజా చిత్రాల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొని కాంట్రవర్సీకి తెరతీసేవాడు. ఆ వివాదాలే తన చిత్రాలకు పబ్లిసిటీగా వాడుకొని, లాభాలూ  చూశాడు. అయితే ప్రతీసారి అదే తీరున సాగుతున్న వర్మతీరు అభిమానులకు సైతం చిరాకు కలిగించింది. తన సంతృప్తి కోసమే తాను సినిమాలు తీసుకుంటానని, ఎవరికోసమో పంథా మార్చుకోననీ వర్మ కుండబద్ధలు కొట్టాడు. అయినా వర్మను అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ గతంలో వర్మ ప్రతిభను తలచుకుంటూ, ఎందుకతను అలా మారిపోయాడో అర్థం కాక సతమతమవుతున్నారు. 

అర్థం కాడు...
తనకిష్టమైన కొట్లాటలను తెరకెక్కించడానికి రాయలసీమ ఫ్యాక్షనిజం కథలవైపూ పరుగు తీశాడు. కొందరు నాయకుల బయోపిక్స్ అంటూ వాటితోనూ వివాదం లేపాడు. టాలీవుడ్ స్టార్ హీరోస్ పేర్లనూ ఉపయోగించుకొని కాంట్రవర్సీస్ కు కారణమయ్యాడు. ముఖ్యంగా మెగాఫ్యామిలీ స్టార్స్ పై వర్మ తరచూ కామెంట్స్ చేస్తూ, వార్తల్లో నిలిచాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి, రావాలని విజయం సాధించాలనీ ట్వీట్ చేసి కలవరం రేపాడు. పవన్ రాజకీయాల్లో పరాజయం పాలు కాగానే 'పవర్ స్టార్' అనే సినిమా తీసేసి, అందులో క్లయిమాక్స్ ట్విస్ట్ గా తానే తెరపై కనిపించి, పవన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అంతదాకా పవన్ ను ప్రతి కోణంలో విమర్శించిన వర్మ, అలా వచ్చి, పవన్ ను పొగిడేసరికి జనానికి వర్మ ఏంటో అర్థం కాలేదు. 

మళ్ళీ దెయ్యమే!
పాతికేళ్ళ క్రితం జయసుధను 'దెయ్యం'గా చూపించి భయపెట్టాలనుకున్నాడు. కానీ, జనం జడుసుకోలేదు సరికదా, రాముకు పిచ్చెక్కింది అనుకున్నారు. ఇప్పుడు మరోమారు 'దెయ్యం'పైనే గురిపెట్టాడు. అయితే ఇదేమీ అదేపనిగా తీసిన సినిమా కాదు. గతంలో రాజశేఖర్ హీరోగా 'పట్టపగలు' అనే చిత్రం రూపొందించాడు వర్మ. దానికే 'ఆర్జీవీ దెయ్యం'గా పేరు మార్చి ఈ నెల 16న జనం ముందు నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ ఏ తరహా వివాదానికి తెరతీస్తాడో చూడాలి.