పులకింపచేసిన పి. పుల్లయ్య చిత్రాలు

పులకింపచేసిన పి. పుల్లయ్య చిత్రాలు

తెలుగు చిత్రసీమలో 'నాన్నగారు', 'డాడి' అని పిలిపించుకున్న మొట్ట మొదటి దర్శకుడు పి. పుల్లయ్య. ఆయన సతీమణి మహానటి శాంతకుమారి. ఈ దంపతులు ఇద్దరినీ ఆరోజుల్లో ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు మమ్మీ,డాడి అంటూ అమ్మానాన్నలుగా గౌరవించేవారు. కలకత్తాలో తెలుగు చిత్రాల నిర్మాణం జరిగిన కాలం నుంచి తెలుగు సినిమా దక్షిణాదికి చేరుకునే వరకూ అనేక వైవిధ్యమైన చిత్రాలను రూపొందించి అలరించారు పి. పుల్లయ్య. ఆరోజుల్లో ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా శ్రీతిరుపతి వేంకటేశ్వరస్మామి వారు గుర్తుకు వచ్చేవారు. మొట్టమొదట తిరుమల వాసుని కథతో బాలాజీ చిత్రాన్ని తెలుగు వారి ముందు ఉంచిన ఘనగ పుల్లయ్యదే. అదే కథను 1960లో మరోసారి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' పేరుతో రూపొందించి మరోమారు తెలుగువారిని పులకింప చేశారు. ముఖ్యంగా రెండో సారి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' రూపొందించినపుడు థియేటర్లే దేవాలయాలుగా మారాయని ఈనాటికీ చెప్పుకుంటారు. ఆ సమయంలో ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని కేంద్రాలలోనూ శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పారు. ఆ విగ్రహాల వద్ద ఉంచిన హూండిల మొత్తం సొమ్మును లెక్కించగా దాదాపు ఆ చిత్రనిర్మాణ వ్యయం అంత వచ్చిందని ఈనాటికీ చెబుతారు. 

అక్కినేనిని తెరపై తొలిసారి కనిపింపచేసిన ఘనత పి.పుల్లయ్యదే. 1941లో పి. పుల్లయ్య రూపొందించిన 'ధర్మపత్ని' ద్వారా అక్కినేని బాలనటునిగా చిత్రసీమలో ప్రవేశించారు. అక్కినేనితో పి. పుల్లయ్య రూపొందించిన 'అర్థాంగి, జయభేరి, సిరిసంపదలు, మురళీకృష్ణ, కొడుకు కోడలు' వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్ ను శ్రీనివాసునిగా జనం మదిలో నిలిపిన ఘనత పుల్లయ్యదే. 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం'తో పాటు 'రేచుక్క, కన్యాశుల్కం' వంటి హిట్ చిత్రాలను ఎన్టీఆర్ తో తెరకెక్కించారు పి. పుల్లయ్య. వీటిలో 'కన్యాశుల్కం' రిపీట్ రన్స్ లోనూ శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకోవడం విశేషం. పి. పుల్లయ్య, శాంతకుమారి దంపతులు ఎంతో మంది వర్ధమాన తారలకు, సాంకేతిక నిపుణులకు ఆశ్రయం ఇచ్చేవారు. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తొలి చిత్రం 'రాముడు భీముడు' నిర్మాణ సమయంలోనూ పుల్లయ్య, శాంతకుమారి దంపతులు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చారు. పి. పుల్లయ్య చిత్ర సీమకు అందించిన సేవలకు గాను 1981లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. విశేషం ఏమంటే పుల్లయ్య సతీమణి శ్రీమతి శాంతకుమారికి కూడా 1999లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఇలా భార్యభర్తలు ఇద్దరికీ ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు లభించటం తెలుగు చిత్రసీమలో ఓ విశేషంగా నిలిచింది.

(మే 2న పి. పుల్లయ్య జయంతి సందర్భంగా)