దాసరి...నీకు నీవే సరి...!

దాసరి...నీకు నీవే సరి...!

 జనం మదిలో కొందరు తరిగిపోని, చెరిగిపోని స్థానం సంపాదించిస్తారు. అలాంటివారు, ఉన్నా లేకున్నా, వారి తలపులు మనలో మెదలుతూనే ఉంటాయి.  దర్శకరత్న దాసరి నారాయణరావు అలాంటి వారే! ఆయన భౌతికంగా దూరమై నాలుగేళ్ళయింది. ఇంకా దాసరి మనమధ్య ఉన్నట్టే భావిస్తున్నారు అభిమానులు. తెలుగు తెరపై దాసరిది ఓ చెరిగిపోని సంతకం. దర్శకుడు అంటే సినిమా క్రూ కు కెప్టెన్ అనేది పాత కాలం మాట. దానిని మళ్ళీ తీసుకువచ్చి, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ అని చాటిన ఘనుడు దాసరి నారాయణరావు. 151 చిత్రాల రూపకల్పనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన మేటి దర్శకుడు దాసరి. టాప్ స్టార్స్ మొదలు, అప్ కమింగ్ ఆర్టిస్టులతోనూ చిత్రాలు తెరకెక్కించి ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు దాసరి. ఆయన సినిమాల ద్వారానే ఎంతోమంది చిత్రసీమలో స్థిరపడిపోయారు. అందుకే దాసరి నారాయణరావు అంటే తెలుగువారికి ఓ ప్రత్యేకమైన అభిమానం. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలయితే చాలు, జనాల్లో ఆసక్తి రేకెత్తేది. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆబాలగోపాలాన్నీ అలరించే చిత్రాలను రూపొందించి మెప్పించారు దాసరి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాణం, దర్శకత్వం ఇలా పలు శాఖల్లో తనదైన బాణీ పలికించిన మేటి దాసరి! ఆయన బహుముఖ ప్రజ్ఞ మనలను పలకరిస్తూనే ఉంటుంది. 

అగ్రనటులతో... 
దాసరి ఎందరు టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, నటరత్న యన్టీఆర్ తోనే ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పాలి. నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన "మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి" చిత్రాలన్నీ శతదినోత్సవాలు చూశాయి. వాటిలో 'సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి" బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ నటరత్న నటనావైభవం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. ఆ వైనాన్ని ఈ నాటికీ ఎవరూ మరచిపోలేరు.

'దేవదాసు' చూసి, అక్కినేని వీరాభిమానిగా మారిన దాసరి నారాయణరావు, ఏయన్నార్ తో 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' అని తెరకెక్కించారు. అదంతలా ఒప్పించకపోయినా, దాసరిలోని క్రియేటివిటీని చూసి జనం మెచ్చారు. తరువాత పలు చిత్రాలలో తన అభిమాన నటునితో పయనించి ఆకట్టుకున్నారు. వాటిలో అన్నిటికన్నా మిన్నగా అలరించిన చిత్రం 'ప్రేమాభిషేకం' అనే చెప్పాలి. ఇందులో అక్కినేని అభినయం, దాసరి దర్శకత్వం తెలుగువారిని విశేషంగా మురిపించాయి.

మహిళా ప్రేక్షక అభిమానం...
టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, వారిలోని నటనకే దాసరి ప్రాధాన్యమిచ్చేవారు తప్ప, కమర్షియల్ హంగులతో కనికట్టు చేయాలని ఏ నాడూ తపించలేదు. దాసరి చిత్రాల్లో ఏముంటుంది? అంటే మనసులు తాకే కథ ఉంటుంది. ఆలోచింప చేసే మాటలు ఉంటాయి. ఆకట్టుకొనే పాటలు ఉంటాయి. నిజమే, ఆయన తెరకెక్కించిన చిత్రాలలో అవన్నీ చోటు చేసుకొని సినిమా చూసిన ప్రేక్షకుణ్ణి ఇంటిదాకా వెంటాడేవి. మళ్ళీ సినిమా థియేటర్ కు వచ్చేలా చేసేవి. అదీ దాసరి ప్రతిభలోని మహత్తు. దాసరి తొలి చిత్రం 'తాత-మనవడు' మొదలు, దాదాపు ఆయన తెరెక్కించిన అన్ని చిత్రాలలోనూ మహిళలు నిత్యం ఎదుర్కొనే  సమస్యలను ఏదో విధంగా చొప్పించేవారు. ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు తగిన మార్గాలూ చూపించేవారు. అందుకే ఆ రోజుల్లో దాసరి సినిమాలకు మహిళా ప్రేక్షకులు పోటెత్తేవారు. 

అసలైన అందరివాడు...
ఒకటా రెండా, 151 చిత్రాల రూపశిల్పి దాసరి. ఆయన చిత్రాలలో అన్నీ విజయం సాధించి ఉండక పోవచ్చు. కానీ, అన్నిటా ఎక్కడో ఓ చోట మనసును తడిచేసే సన్నివేశాలను చొప్పించేవారు. దాసరి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో తమ ఉనికిని చాటుకున్నారు. కొందరు స్టార్స్ గానూ ఎదిగారు. ఇక చిత్రసీమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, దాని పరిష్కారానికి దాసరి ముందుండేవారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేవారు. ఆపన్నులను ఆదుకోవడానికి దాసరి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. అర్ధరాత్రి ఆయన దగ్గరకు వెళ్ళినా, తగిన న్యాయం జరగుతుందని సినిమా జనం భావించేవారు. అందుకే అసలైన 'అందరివాడు' అంటే దాసరే అని ఈ నాటికీ జనం చెప్పుకుంటున్నారు. 
ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగువారికి అందించిన దాసరి నారాయణరావు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొన్ని చిత్రాలు రూపొందించారు.  ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులూ, రివార్డులూ రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. నేడు దాసరి లేరు. ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరు.  ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలచిన దాసరి తెలుగువారి మదిలో సదా నిలచే ఉంటారు. ఎందరి మదిలోనో 'గురువు గారు'గా కొలువై ఉన్నారు. రారు మరో దాసరి ... ఆయనకు ఆయనే సరి...