కరోనా ఉన్నా.. కర్రల సమరం జరుగుతుందా ?

కరోనా ఉన్నా.. కర్రల సమరం జరుగుతుందా ?

కర్నూలు జిల్లా దేవరగట్టు అంటే అందరి మదిలో ముందుగా మెదిలేది కర్రల సమరమే. భయానక దృశ్యాలు నెత్తురోడుతున్న వారిని మోసుకెళ్లే చిత్రాలు దసరా రోజున ఇక్కడ కనిపిస్తుంటాయి. పరిస్థితి చేయిదాటితే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఎన్నో ఉన్నాయి. దసరా పండుగ వేళ దేవరగట్టులో ఈ వేడుకలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. దేవునిపై భక్తితో తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు.

రక్తం చిందినా సరే దేవునిపై విశ్వాసం, భక్తి, సంప్రదాయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు స్థానికులు. పండుగ రోజున అందరి ఇళ్లలో కొత్త బట్టలు వేసుకొంటారు. పిండివంటలు చేసుకొని ఆనందంగా గడుపుతుంటారు. బంధువులందరినీ పిలుచుకొని సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అలాంటి సమయంలోనే దేవరగట్టులో కర్రల సమరం జరుగుతుంది.  

ఐతే...దేవరగట్టు కర్రల సమరంలో హింసను నివారించటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ప్రతి ఏటా బన్నీ ఉత్సవానికి పది రోజుల ముందు పోలీసులు, అధికారులు హడావుడి చేస్తారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఇళ్లిల్లూ తనిఖీ చేసి కర్రలు స్వాధీనం చేసుకుంటారు. బన్ని ఉత్సవం రోజున వెయ్యి మందికి పైగానే పోలీసులతో బందోబస్తు..చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. కర్రల సమరం అదుపు చేస్తామంటారు పోలీసులు. బన్నీ ఉత్సవం ప్రారంభమయ్యే సమయానికి వేల సంఖ్యలో కర్రలతో బయటకు వస్తారు. ఇనుప రింగులు చుట్టిన కర్రలతో ప్రత్యక్షమవుతారు జనం. ఎప్పటి లాగే రక్తం చిందడం, అప్పుడప్పుడూ ప్రాణాలు కోల్పోవడం మామూలుగానే జరిగిపోతుంటుంది. 

ఇక...బన్ని ఉత్సవాల్లో హింస నాణేనికి ఒక వైపు అయితే భక్తి మరోవైపు కనిపిస్తుంటుంది. మాలమల్లేశ్వర స్వామిపై స్థానికులకు ఎంతో భక్తి. పలు గ్రామాలకు చెందిన వారు దాదాపు రెండు లక్షల మంది దేవరగట్టు ఉత్సవాలకు హాజరవుతారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. దసరా పండుగ రోజున రాత్రంతా మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్ని ఉత్సవం, భవిష్యవాణి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిజానికి...వీరిలో హింసా ప్రవృత్తి ఉన్నవారు తక్కువగానే ఉంటారు. ఐతే...పూర్వకాలంలో ఆయా గ్రామాల నుంచి జనం రాత్రి వేళ కొండపై ఉన్న దేవరగట్టు ఆలయానికి వస్తుండేవారు.

అలా వచ్చే సమయంలో అటవీ మార్గంలో జంతువుల భయం కారణంగా కర్రలు తీసుకువచ్చేవారు. చీకట్లో దారి కన్పించేందుకు దివిటీలు తెచ్చేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు భక్తితో ఆయా గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నట్టుగా నాట్యం చేసేవారు. అది కాలక్రమేణా కక్షలు తీర్చుకునేందుకు...సంప్రదాయం పేరుతో రక్తం చిందేందుకు దారితీసింది. కరోనా కారణంగా అన్ని రకాల ఉత్సవాలు రద్దయ్యాయ్. లక్షల్లో జనం హాజరయ్యే బన్నీ వేడుకలు కూడా రద్దు చేశారు అధికారులు. ఐతే అలా కుదరదంటున్నారు స్థానికులు. ఇంతకీ...బన్నీ ఉత్సవం జరుగుతుందా? పోలీసు ఆంక్షలతో రద్దవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.