డిపార్టుమెంటుకే చెడ్డపేరు తెస్తున్న చిత్తూరు పోలీసుల తీరు

డిపార్టుమెంటుకే చెడ్డపేరు తెస్తున్న చిత్తూరు పోలీసుల తీరు

వంద డయల్‌ చేస్తే పోలీసులు రావడం లేదు. వంద కొడితే పోలీసులు వస్తున్నారు. ఇది చిత్తూరు జిల్లాలో ఈ మధ్య బాగా పాపులర్‌ అయిన డైలాగ్‌. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు డిపార్ట్‌మెంట్‌నే నివ్వెర పరుస్తున్నాయి. దీంతో కనిపించని నాలుగో సింహానికి జిల్లాలో ఏమైందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి!

చిత్తూరు జిల్లాలో కొందరు పోలీసులు గాడి తప్పారు. వృత్తి ధర్మం మరిచిపోయారు. వారు చేస్తున్న పనుల కారణంగా పోలీస్‌ శాఖకే మచ్చ తెచ్చి పెడుతున్నారు. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు సమీక్షలు పెట్టినా.. సిబ్బందిలో మార్పు రావడం లేదు. సామాన్యులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలే  ఉదాహరణగా చెబుతున్నారు. 

తిరుపతి భూ కబ్జాలో పోలీసుల పాత్ర.. అలిపిరి సీఐ బదిలీ!

మదనపల్లెలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన కానిస్టేబుల్‌ తర్వాత ముఖం చాటేయడంతో సుగుణ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ను కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  పీలేరు నియోజకవర్గం వాయల్పాడులో భర్తను చంపిన వారిని అరెస్ట్‌ చేయాలని  న్యాయం కోసం వెళ్లిన మహిళను దారుణంగా కొట్టడంతో.. ఆ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. తిరుపతిలో భూ కబ్జా రాష్ట్రంలో సంచలనం చేపింది. ఈ దందాలో పోలీసుల పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  అలిపిరి సీఐపై వేటు వేశారు. 

దారిదోపిడీలకు పాల్పడిన కానిస్టేబుళ్లపై చర్యలు!

రామసముద్రం వద్ద టామోటో లోడ్‌తో వెళ్తున్న వెహికిల్‌ డ్రైవర్‌ దగ్గర కానిస్టేబుల్‌ 50 రూపాయలు లంచం డిమాండ్‌ చేస్తున్న విజువల్స్‌ వైరల్‌గా మారింది. దీంతో అతడిని వీఆర్‌కు పంపారు అధికారులు. తడుకుపేట చెక్‌పోస్టు దగ్గర వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు ఎస్పీవోలను పోలీసులే అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఇదంతా ఓ ఎత్తు అయితే పోలీసులే దారిదోపిడీకి దిగడం మరింత కలకలానికి కారణమైంది.  ముగ్గురు కానిస్టేబుళ్లు.. స్నేహితులతో కలిసి వడమాల పేట- చెన్నై హైవేలో దారిదోపిడీకి దిగారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో  దారిదోపిడీకి పాల్పడుతున్న కానిస్టేబుళ్లను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు  గోప్యత పాటిడం విమర్శలకు దారితీసింది.

కొందరి ప్రవర్తనతో డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ!

స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసినందుకుగాను పదివేలు లంచం తీసుకుంటూ ఓ ASI ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.  ఇలా చెప్పుకొంటూ పోతే  చాలా అవినీతి ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. దీంతో వంద డయల్‌ చేస్తే పోలీసులు రావడం లేదు.. వంద కొడితే పోలీసులు వస్తున్నారు అని  జనం కామెంట్స్‌ చేసుకునే పరిస్థితి ఉంది. కొందరు సిబ్బంది ప్రవర్తన మొత్తం పోలీస్‌ శాఖకే మాయని మచ్చగా మిగులుతుందనే వ్యాఖ్యలు జిల్లా పోలీస్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

ఆరోపణలు వస్తే ఉపేక్షించని ఎస్పీలు!

ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్న ఈ ఘటనలను తిరుపతి ఎస్పీ రమేష్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆరోపణలు వస్తే సిబ్బందిని అస్సలు ఉపేక్షించడం లేదు. డిపార్ట్‌మెంట్‌ వారైనా అరెస్ట్‌ చేసి.. చట్టం ముందు అంతా సమానమని తమ చర్యల ద్వారా  నిరూపిస్తున్నారు. అయినా కొందరు సిబ్బంది తీరు తెగించేలా ఉండటంతో నాలుగో సింహానికి ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.