ఢిల్లీ పేలుళ్లకు ఇరాన్ తో లింక్... ?

ఢిల్లీ పేలుళ్లకు ఇరాన్ తో లింక్... ?

ఢిల్లీ ఇజ్రాయిల్ ఎంబసీ కి 150 మీటర్ల దూరంలో తేలికపాటి బాంబుపేలుడు జరిగిన సంగతి తెలిసిందే.  ఈ బాంబు పేలుళ్లలో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  అదే సమయంలో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వద్ద బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం జరుగుతున్నది.  వీవీఐపీలు నివసించే ప్రాంతంలో బాంబు పేలుళ్లు ఎలా జరిగాయి అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.  అయితే, ఈ పేలుళ్ల తరువాత బాంబు క్లూస్ టీమ్ రంగంలోకి దిగి అడుగడుగున పరిశీలించడం మొదలుపెట్టింది.  పోలీసులు, ఎన్ఐఏ, భద్రతా  బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.  ఇక సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి.  పేలుళ్లు జరగడానికి ముందు ఓ క్యాబ్ లో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్టు ఫుటేజ్ లో కనిపించింది.  క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తనకు తెలిసిన విషయం చెప్పాడు.  బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతంలో కాలిన పింక్ కలర్ చున్నీ, ఓ చిన్న ఎన్వలప్ కవర్ ను గుర్తించారు.  లేఖను ఇజ్రాయిల్ రాయబారిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా అధికారులు గుర్తించారు.  లేఖలో ఇటీవలే మరణించిన ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ సులేమాని, అణుశాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నాయి.  ఇది ట్రైలర్ మాత్రమే అని లేఖలో రాసుంది.  దీంతో ఈ పేలుళ్లకు ఇరాన్ తో లింక్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.