ఢిల్లీ మాయాపురిలో సీలింగ్ పై ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్

ఢిల్లీ మాయాపురిలో సీలింగ్ పై ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్

ఢిల్లీలోని మాయాపురి ఇండస్ట్రియల్ ఏరియాలో సీలింగ్ విధించడానికి వెళ్లిన బృందానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్థానిక వ్యాపారులు భారీ గందరగోళం, విధ్వంసం సృష్టించారు. ఎంసీడీ అధికారులు సీలింగ్ ఆపరేషన్ ప్రారంభించగానే గొడవ ప్రారంభమైంది. దీంతో పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. వ్యాపారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్ లో కొందరు గాయపడినట్టు తెలిసింది. ఢిల్లీలోని అతిపెద్ద చెత్త మార్కెట్ లో శనివారం ఉదయం సీలింగ్ బృందం చేరుకొంది. ఉద్రిక్తతలు తలెత్తవచ్చని ముందు జాగ్రత్తగా సీలింగ్ టీమ్ తో పాటు ఢిల్లీ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ జవాన్లు కూడా మార్కెట్ కి వెళ్లారు.

సీలింగ్ టీమ్ కాలుష్యాన్ని వ్యాపింపజేసే ఫ్యాక్టరీలపై చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు సీలింగ్ చర్యలు చేపట్టడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఎన్జీటీ ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్టీఎఫ్ బృందంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, ఎంసీడీ, ఢిల్లీ పోలీస్, ఎస్డీఎంలు కూడా ఉన్నాయి. వీళ్లు మార్కెట్ ను పరిశీలించి తమ రిపోర్ట్ సమర్పించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ చర్యలు ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ అతిక్రమణలు తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం సంఘటన స్థలానికి హరినగర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జగ్ దీప్ సింగ్ చేరుకున్నారు. మార్కెట్ లో సీలింగ్ చర్యలు కొనసాగుతున్నాయి.

స్థానిక వ్యాపారులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. 'తమ సొంత వ్యాపారులను కొట్టించడం ఎంత సిగ్గుచేటు. వ్యాపారులు ఎప్పుడు తమ డబ్బు, ఓట్లతో బీజేపీకి సహకరించారు. అందుకు బదులుగా బీజేపీ వాళ్ల దుకాణాలు సీల్ చేయించింది. వాళ్లని లాఠీలతో కొట్టించింది. ఎన్నికల సమయంలో కూడా వ్యాపారులపై ఇంత అమానుషంగా లాఠీ చార్జీనా? వ్యాపారుల మద్దతు తమకు అక్కర్లేదని బీజేపీ స్పష్టంగా చెబుతోందని' కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఈ సంఘటనలో తొమ్మిది మంది పోలీసులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది గాయపడినట్టు తెలిసింది.