బోణి కొట్టిన ఢిల్లీ.. సూపర్ ఓవర్‌లో విక్టరీ

బోణి కొట్టిన ఢిల్లీ.. సూపర్ ఓవర్‌లో విక్టరీ

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఢిల్లీ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌ మజా ఎంటో చూపించింది. తొలుత ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేయగా... పంజాబ్‌ కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో ఢిల్లీ 3 పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలి విక్టరీ నమోదు చేసింది.

వాస్తవానికి రెండో ఇన్నింగ్స్  19.4 ఓవర్లకు స్కోర్ సమం అయింది. రెండు బంతుల్లో  ఒక రన్ కొట్టాల్సి ఉండగా, మయాంక్ అగర్వాల్ ఔట్ అయ్యాడు. ఫోర్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి  వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక బాల్‌లో ఒక రన్ కావాల్సి ఉండగా, జోర్డాన్ కొట్టిన బంతిని రబాడా  క్యాచ్ పట్టాడు. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయింది. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్  ఓవర్లో ఢిల్లీ బౌలర్ రబాడా బౌలింగ్ చేశాడు. మూడు బంతుల్లోనే కేఎల్ రాహుల్, పూరన్‌ను  ఔట్ చేశాడు. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు పడడంతో సూపర్ ఓవర్ ఫినిష్ అయిపోయింది. ఇక  కింగ్స్ లెవన్ పంజాబ్‌ తరఫున షమీ బౌలింగ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ బరిలోకి  దిగారు. మొదటి బాల్ డాట్ బాల్. రెండో బంతి వైడ్. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి.  దీంతో ఢిల్లీ విజయం సాధించింది.

ఇక, మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158  పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ టీమ్ మొదట్లో బాగానే ఆడింది. కేఎల్  రాహుల్ ఔట్ అయ్యాక మెల్లగా వికెట్లు పడ్డాయి. మధ్యలో స్కోర్ నెమ్మదించింది. మొదటి  నుంచి క్రీజ్‌లో నిలిచిన మయాంక్ అగర్వాల్ మెల్ల మెల్లగా కుదురుకున్నాడు. చివర్లో దుమ్ము  దులిపాడు. తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 59 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే స్కోర్ 157 వద్ద ఔటయ్యాడు. చివరి బంతికి ఒక్క రన్ కొడితే గెలిచే వేళ ఔట్  అయ్యాడు. లాంగ్ షాట్ ఫోర్ కొట్టాడు. కానీ, అది క్యాచ్ అయింది. అంతకు ముందు ఢిల్లీ ప్లేయర్  స్టొయినిస్ చివరి ఓవర్లలో చెలరేగి ఆడాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు  కోల్పోయి 157 పరుగులు సాధించింది.