దీపికా పదుకొనె ఫ్యామిలీకి కరోనా పాజిటివ్

దీపికా పదుకొనె ఫ్యామిలీకి కరోనా పాజిటివ్

ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ నటి దీపికా పదుకొనె తండ్రి ప్రకాష్ పదుకొనెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రకాష్ కరోనా నుండి కోలుకుంటున్నారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడైన ప్రకాష్ పదుకొనె ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ఇప్పుడు 65 ఏళ్ళు. 10 రోజుల క్రితం ప్రకాష్, అతని భార్య ఉజ్జల, అతని రెండవ కుమార్తె అనిషా కరోనా బారిన పడ్డారు అని ప్రకాష్ స్నేహితుడు, ప్రకాష్ పదుకొనె బాడ్మింటన్ అకాడమీ (పిపిబిఎ) డైరెక్టర్ విమల్ కుమార్ తెలిపారు. ఒక వారంపాటు ఐసోలేషన్ లో ఉన్నా ప్రకాష్ కు ఫీవర్ తగ్గకపోవడంతో, గత శనివారం ఆయన బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. ప్రకాష్ భార్య, కుమార్తె ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఇక ప్రకాష్ పదుకొనె 1970, 1980లలో తన ఆటతీరుతో భారతీయ బాడ్మింటన్ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా నిలిచారు. కాగా దీపికా ఇటీవలే ఈ కరోనా సంక్షోభ సమయంలో మెంటల్ హెల్త్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అభిమానులకు చెప్పుకొచ్చింది. ఇక దీపికా సినిమాల విషయానికొస్తే... '83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించింది దీపికా. కరోనా కేసుల పెరుగుదల కారణంగా '83' విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు మేకర్స్.