దుబ్బాక సమరం.. ఇవాళే అసలు విషయం తేలిపోనుంది..!

దుబ్బాక సమరం.. ఇవాళే అసలు విషయం తేలిపోనుంది..!

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానుంది. ఇప్పటివరకూ మొత్తం 46 మంది నామినేషన్లు వేయగా.. అందులో 12 నామినేషన్లు సరిగా లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు ఇప్పటివరకు లెక్కతేలారు. ఫైనల్‌గా ఎంతమంది బరిలో ఉంటారనేది ఈ సాయంత్రం క్లారిటీ రానుంది. అయితే, ఇండిపెండెంట్లకు తోడు చిన్నాచితక పార్టీల అభ్యర్థులు ఎందరున్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నెలకొంది.

ఇక, ఇప్పటికే ప్రచారంలో నువ్వా?నేనా? అన్నట్టుగా పోటీపడుతున్నారు పాలక, ప్రతిపక్షాలు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరపున అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు .. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. గోబెల్స్‌ ప్రచారాన్ని నమ్ముకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు హరీశ్‌. కాంగ్రెస్, బీజేపీ ఎండమావుల్లాంటివన్నారు హరీష్. మరోవైపు.. కాంగ్రెస్‌, బీజేపీలు సైతం టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రచారంలో వేడిని పెంచాయి. ఈసారైనా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేస్తుండగా.. ఒక్కసారి గెలిపించి చూడండని బీజేపీ కోరుతోంది. మొత్తంగా, పార్టీలన్నీ ఓటర్లను కాకా పట్టడంలో బిజీ అయ్యాయి. కాగా, నవంబర్‌ 3న, దుబ్బాకలో పోలింగ్‌ జరగనుండగా.. 10న ఫలితం వెల్లడికానున్న విషయం తెలిసిందే.