ఆసీస్ కు షాక్.. టీ20 సిరీస్ కు వార్నర్ దూరం..

ఆసీస్ కు షాక్.. టీ20 సిరీస్ కు వార్నర్ దూరం..

భారత జట్టు పై వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. ఆ రెండు వన్డేల్లో అర్ధశతకాలు సాధించిన ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆదివారం రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ అతను గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల్లో నొప్పితో మైదానంలోనే విలవిల్లాడడంతో వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా జట్టు వైద్య బృందం వార్నర్‌ను బయటకు తీసుకెళ్లింది. అయితే ఆ గాయం తీవ్రత కారణంగా వార్నర్ భారత్ తో జరగనున్న నామమాత్రపు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పష్టం చేశాడు. వార్నర్‌ స్థానాన్ని జాన్‌ మాథ్యూ షార్ట్‌ భర్తీ చేస్తాడని తెలిపాడు. అలాగే తమ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలుపొందడంతో.. టెస్టు సిరీస్‌కు ముందు ప్రధాన పేసర్‌ పాట్‌ కమిన్స్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు ఆసీస్‌ కోచ్‌ తెలిపాడు. అతని స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నట్లు వివరించాడు.