ఫాల్కే నటరత్నాలు...!

ఫాల్కే నటరత్నాలు...!

చలనచిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేయడం  1969 నుండి ఆనవాయితీగా వస్తోంది. తొలి అవార్డును నాటి మేటి నటి దేవికారాణి అందుకున్నారు. తరువాతి సంవత్సరం అంటే 1970లో ప్రఖ్యాత బెంగాలీ నిర్మాత బీరేంద్రనాథ్ సర్కార్ కు ఈ అవార్డు లభించింది. ఆ పై ఏడాది 1971లో  ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ కపూర్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ మేలిమి రత్నంగా నిలచింది. నటుల్లో ఈ అవార్డును అందుకున్న తొలివ్యక్తిగా పృథ్వీరాజ్ కపూర్ నిలిచారు. మరో విశేషమేమంటే, ఆయన తనయుల్లో పెద్దకొడుకు రాజ్ కపూర్, చిన్న కొడుకు శశికపూర్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే ను అందుకున్నారు.

మనవాళ్ళే... ముందు... 
దక్షిణాదిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి సినిమా వ్యక్తి  బి.ఎన్.రెడ్డి. 1974లో బి.ఎన్. కు ఈ అవార్డు లభించింది. సౌత్ ఇండియాలో ఈ అవార్డును అందుకున్న తొలి నటుడు పైడి జయరాజ్. అయితే, తెలుగువారయినా పైడి జయరాజ్ హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి గాంచారు. కాబట్టి, ఆయనకు దక్కిన ఈ అవార్డును ఉత్తరాది చిత్రసీమ ఖాతాలోనే వేయవలసి ఉంటుంది. మన దక్షిణాదిన ఈ అవార్డు దక్కించుకున్న తొలి నటుడు ఎల్.వి.ప్రసాద్ అనే చెప్పాలి. ఆయన నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించారు. మన భారతదేశంలో రూపొందిన తొలి టాకీ 'ఆలమ్ ఆరా'లోనూ, దక్షిణాది తొలి టాకీ 'కాళిదాసు'లోనూ, తెలుగు తొలి టాకీ 'భక్త ప్రహ్లాద'లోనూ నటించారు ఎల్వీ ప్రసాద్. అందువల్ల సౌత్ లో దాదాసాహెబ్  ఫాల్కే అవార్డు అందుకున్న తొలి నటునిగా ఎల్వీ ప్రసాద్ నిలచిపోయారు. అయితే దక్షిణాదిన స్టార్‌ హీరోగా జేజేలు అందుకొని  దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న తొలి నటుడు అక్కినేని నాగేశ్వరరావు అనే చెప్పాలి. 1990లో ఏయన్నార్ కు ఫాల్కే అవార్డు లభించింది. 

కొన్ని విశేషాలు...
అక్కినేని తరువాత స్టార్స్ గా వెలుగొంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న వారిలో దిలీప్ కుమార్ (1994), కన్నడ రాజ్ కుమార్ (1995), శివాజీ గణేశన్ (1996) ఉన్నారు. వరుసగా మూడు సంవత్సరాలు ఈ మేటినటులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం విశేషం. వీరి తరువాత 2002లో దేవ్ ఆనంద్ కు ఈ పురస్కారం లభించింది. ఆపై 2011లో ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీకి, వెంటనే 2012లో మరో ప్రముఖ నటుడు ప్రాణ్ కు ఫాల్కే అవార్డు దక్కింది. 2014లో నటదర్శకుడు శశికపూర్ కు, 2015లో  నటదర్శకనిర్మాత మనోజ్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. 1994 తరువాత మళ్ళీ  ఇన్ని ఏళ్ళకు వరుసగా మూడు సంవత్సరాలు నటులకే ఈ అవార్డు దక్కడం విశేషం.  2017లో వినోద్ ఖన్నాకు, 2018లో అమితాబ్ బచ్చన్ కు, 2019లో రజనీకాంత్ కు వరుసగా ఈ అవార్డు లభించింది. 

మరో విశేషం!
వరుసగా మూడేళ్ళు  నటులకే అవార్డులు వచ్చాయని చెప్పుకుంటున్నాం కదా! శశికపూర్, మనోజ్ కుమార్ తరువాత మన కె.విశ్వనాథ్ కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే లభించింది. మన కె.విశ్వనాథ్ దర్శకునిగానే లబ్దప్రతిష్ఠులైనా, నటనలోనూ ఆయన రాణించిన విషయం తెలిసిందే. ఈ తీరున వరుసగా మూడేళ్ళు  నటదర్శకులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిందని చెప్పాలి. ఇక ఈ ముగ్గురినీ నటులుగానూ పరిగణిస్తే, 2014 నుండి 2019 దాకా అంటే రజనీకాంత్ వరకు ఆరు సంవత్సరాలు వరుసగా నటులకే దాదాసాహెబ్ ఫాల్కే దక్కినట్టయింది. మరి 2020లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి.