మరపురాని మూవీ మొఘల్

మరపురాని మూవీ మొఘల్

కొందరు వ్యక్తులను ఎన్నటికీ మరచిపోలేము... వారికి సంబంధించిన ఏ విషయం చర్చకు వచ్చినా వారి ఘనతను గుర్తు చేసుకోక మానము... అలా తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయులు మూవీ మొఘల్ డి.రామానాయుడు... ఫిబ్రవరి 18న రామానాయుడు వర్ధంతి.. రామానాయుడు పేరు తలచుకోగానే ఆయన సాధించిన అపూర్వ  విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కథా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన తీరు మన మదిలో మెదలుతుంది. భారతదేశంలోని 14 భాషల్లో 12 ప్రముఖ భాషల్లో చిత్రాలను నిర్మించి, దేశంలోనూ ఘనతను సాధించారు. అనితరసాధ్యంగా రామానాయుడు సాగిన తీరును గుర్తు చేసుకుంటే మనసు పులకించి పోవలసిందే. అందుకే భావి నిర్మాతలెందరో ఆయననే ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో అడుగు పెడుతూ ఉంటారు. నవతరం సైతం రామానాయుడు కీర్తి శిఖరం నుండి స్ఫూర్తిని పొందుతూనే ఉంది. 

రారమ్మని పిలిచిన సినిమా
ఆరడుగుల ఎత్తు... ఆకర్షించే రూపం... ఏ పని చేపట్టినా త్రికరణశుద్ధిగా చేసే తత్వం రామానాయుడు సొంతాలు... వాళ్ళ  స్వగ్రామంలో ఏయన్నార్ 'నమ్మినబంటు' సినిమా షూటింగ్ జరిగింది. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు రామానాయుడుకు సమీప బంధువు. దాంతో ఆ సినిమా షూటింగ్ లో యూనిట్ వారికి కావలసినవి సమకూరుస్తూ హుషారుగా పాలు పంచుకున్నారు. ఆయన ఉత్సాహం చూసి నువ్వూ  సినిమాల్లోకి రారాదు అని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే ఆయన సినిమా రంగంవైపు అడుగులు  వేశారు. 

రామారావు ద్విపాత్రాభినయంతో...
మదరాసు చేరిన తరువాత రామానాయుడు కొంతకాలం రైసు మిల్లు నడిపారు. ఆ పని చూస్తూనే, మరోవైపు సినిమా రంగం లోతుపాతులు పరిశీలించసాగారు. అందులో భాగంగానే 'అనురాగం' చిత్రానికి భాగస్వామిగా చేరారు. దాంతో కాసింత అనుభవం రాగానే తన పెద్ద కొడుకు సురేశ్ బాబు పేరున 'సురేశ్ ప్రొడక్షన్స్ ' బ్యానర్ పెట్టారు. తొలి ప్రయత్నంలోనే యన్టీఆర్ తో 'రాముడు-భీముడు' తీశారు. తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలచింది. యన్టీఆర్ కు 'రాముడు-భీముడు' తొలి ద్విపాత్రాభినయ చిత్రం కావడం విశేషం: తొలి చిత్రంతోనే విజయం సాధించడంతో రామానాయుడులో ఉత్సాహం ఉరకలు వేసింది. తడుముకోకుండా తరువాత యన్టీఆర్ తోనే 'శ్రీకృష్ణ తులాభారం' వంటి భారీ పౌరాణికం తీసి ఆకట్టుకున్నారు.  తెరపై రామారావు శ్రీకృష్ణునిగా, జమున సత్యభామగా అలరించిన తీరుతో ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఆ పై రామారావుతో రామానాయుడు తీసిన 'స్త్రీ జన్మ' అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

'ప్రేమనగర్' వెలసింది...
రామారావుతో సినిమాలు తీస్తూనే, గ్యాప్ లో కాంతారావు వంటి కథానాయకులతోనూ 'ప్రతిజ్ఞా పాలన, బొమ్మలు చెప్పిన కథ' వంటి జానపదాలు నిర్మించారు రామానాయుడు. ఆ పై ఏయన్నార్ తో 'సిపాయి చిన్నయ్య' నిర్మించారు. ఆ సినిమా పరాజయం పాలయింది. ఆపై రామానాయుడు నిర్మించిన కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ రూటులో సాగాలని తపించారు నాయుడు. 'ప్రేమనగర్' నవలను అదే పేరుతో సినిమాగా తీశారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న తెగింపుతో ఖర్చుకు వెనుకాడకుండా 'ప్రేమనగర్'ను నిర్మించారు. రామానాయుడు తెగువతో తెరకెక్కిన 'ప్రేమనగర్' ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తరువాత రామానాయుడు మరి వెను తిరిగి చూసుకోలేదు. 

ఇతర భాషల్లో... 
'ప్రేమనగర్' విజయంతో రామానాయుడులో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీగణేశన్ హీరోగా 'వసంత మాలిగై' పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. శివాజీ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచింది. 
'ప్రేమనగర్'ను హిందీలోనూ రీమేక్ చేశారు. రాజేశ్ ఖన్నా, హేమామాలిని జంటగా నటించిన హిందీ 'ప్రేమ్ నగర్' కూడా మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. దాంతో రామానాయుడు మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, హిందీ చిత్రసీమల్లోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనే కాదు కన్నడ, మళయాళ, భోజ్ పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ భాషల్లోనూ చిత్రాలను నిర్మించారు రామానాయుడు.  ఓ నిర్మాత ఇన్ని భాషల్లో సినిమాలు నిర్మించడం నిజంగా విశేషమే. భారతదేశంలో 12 భాషల్లో సినిమాలు తీసిన చరిత్ర మరొకరికి కానరాదు. 

ఎందరికో చేయూత...
రామానాయుడు తాను చేసే ఏ పనినైనా త్రికరణ శుద్ధిగా చేసేవారు. తాను ఇష్టపడిన సినిమాను మరింతగా అభిమానించారు. ఎంతగా అంటే సినిమా ఆయనకు ఓ వ్యసనంగా మారింది. సినిమానే ఆయనకు శ్వాస అయింది. తన చిత్రాల ద్వారా ప్రతిభావంతులకు పట్టం కట్టడమూ మొదలు పెట్టారు. ఎంతోమంది దర్శకులను, కళాకారులను తన సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. వారందరూ సినిమా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.  ఈ నాటికీ రామానాయుడు పేరు తలచుకుంటూనే ఉన్నారు. 
చిత్రసీమ అంటే ప్రాణం పెట్టే రామానాయుడు, తాను సంపాదించినదంతా మళ్ళీ సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. నిర్మాణంలో సాగుతూనే స్టూడియోను నిర్మించారు. పంపిణీ సంస్థను, పబ్లిసిటీ కంపెనీని నెలకొల్పి, సినిమారంగానికి చేతనైన సేవలు అందించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాదు, తన సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు నాయుడు. 

అలుపెరుగని నాయుడు
పోటీ అంటే రామానాయుడుకు మహా ఇష్టం... ఇతర నిర్మాతలతో సత్సంబంధాలు ఉన్న నాయుడు, వారితోనూ సినిమాలతో పోటీ పడ్డారు... అంతెందుకు తన తనయులతోనే పోటీ పడి మేటిగా నిలిచారాయన... నిజానికి రామానాయుడు తన పర్సనాలిటీకి నటుడు కావాలనే చిత్రసీమలో అడుగు పెట్టారు. ఎందుకనో నటనలో తాను రాణించలేనని నిర్ణయించుకున్నాకే నిర్మాతగా మారారు. అయినా తనలోని నటనాభిలాషతో తన చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించేవారు. అయితే రామానాయుడు వారసుడు వెంకటేశ్ ఆయన నటనాభిలాషను తీర్చారు. తండ్రి నిర్మించిన 'కలియుగ పాండవులు'తో తెరంగేట్రం చేసిన వెంకటేశ్ తనదైన అభినయంతో తండ్రికి మంచి పేరు సంపాదించి పెట్టారు. తనయుని ఉత్తమ నటునిగా నిలిపే చిత్రాలను తీసి తండ్రిగా నాయుడు మురిసిపోయారు.  రామానాయుడు అలుపు లేకుండా సినిమాలు తీస్తున్న సమయంలో ఆయన పెద్ద కొడుకు ఇక విశ్రాంతి తీసుకోండి అన్నారు. అయినా రామానాయుడు తన పంథాలో తాను సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగారు. తండ్రి చూపిన బాటలోనే సురేశ్ బాబు 'బొబ్బిలి రాజా'తో నిర్మాతగా మారారు. తొలి సినిమాతోనే నిర్మాతగా 'బొబ్బిలి రాజా'తో ఘనవిజయం సాధించారు సురేశ్ బాబు. 

తనయులతో పోటీ...
సురేశ్ బాబు, వెంకటేశ్ బాబు ఇద్దరూ తండ్రితో పోటీపడి చిత్రాలు నిర్మించారు. అయితే వారిద్దరూ కలసి ఓ సినిమా తీసేలోపు , రామానాయుడు రెండు చిత్రాలను విడుదల చేసేవారు... అంత స్పీడుగా సినిమాలు నిర్మిస్తూ రామానాయుడు శతాధిక చిత్ర నిర్మాతగా నిలిచారు. జనం మదిని గెలిచారు. రాజకీయాల్లోనూ బాపట్ల పార్లమెంట్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. జనానికి చేతనైన సాయం చేశారు. వృద్ధాశ్రమం నిర్మించారు. ఇలా ఎంతోమంది మదిలో చెరిగిపోని స్థానం సంపాదించిన రామానాయుడు  ఆరేళ్ళ క్రితం తనువు చాలించారు. అయినా ఆయనను మరచిపోయిన వారు లేరు. ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో ప్రవేశించే నిర్మాతలు ముందుగా రామానాయుడునే తలచుకుంటున్నారు. అదీ ఆయన సాధించిన ఘనత! రామానాయుడు వంటి కీర్తి శిఖరాన్ని ఎవరూ మరచిపోలేరు... భావితరాలు ఆ శిఖరం నుండి స్ఫూర్తి చెందుతూనే ఉంటాయి... అది సత్యం... ఆయన కీర్తి వెలుగును నిత్యం...