నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..గెలుపు ఏ పార్టీది..?

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్..గెలుపు ఏ పార్టీది..?

అక్కడ అధికార పార్టీకే  గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఓట్లు పడ్డాయనే ప్రచారం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఈ క్రాస్‌ ఓటింగ్‌ ఆ రెండు పార్టీల్లో ఒక్కటే గుబులు రేపుతోందట. ఇంతకీ ఇందూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది. 

80శాతానికి పైగా ఓట్లు వస్తాయంటున్న టీఆర్‌ఎస్‌

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌ జరిగింది. 824 మంది స్థానిక సంస్థల ఓటర్లలో ఒకరు చనిపోగా.. ఉన్న 823 మందిలో 821 మంది నేరుగా ఓటు వేశారు. ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎవరు ఎవరికి ఓటు వేశారు.. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయంటూ మొదలైన చర్చ రాజకీయంగా ఆసక్తి రేకిస్తోంది. తమకు 80 శాతానికిపైగా  ఓట్లు వస్తాయని టీఆర్‌ఎస్‌ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. వాస్తవానికి అధికార పార్టీకి 60 శాతం ఓట్లు ఉన్నాయి. మరి.. 80 శాతం ఓట్లు వస్తాయని అని అన్నారంటే.. కాంగ్రెస్‌, బీజేపీల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందనే అనుమానాలు ఉన్నాయట. 

కాంగ్రెస్‌, బీజేపీ శిబిరాల్లో క్రాస్‌ ఓటింగ్‌ భయం?

ఈ విషయం తెలిసినప్పటి నుంచి విపక్ష పార్టీ శిబిరాల్లో ఆందోళన నెలకొందట. అసలే ఉన్నవి తక్కువ ఓట్లు.. అవి కూడా పడకపోతే క్షేత్రస్థాయిలో మరింత బలహీన పడతామని కలవరపడుతున్నారట బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు. పోలింగ్‌కు ముందు టీఆర్‌ఎస్‌ ఓట్లే తమకు పడతాయని ప్రకటనలు చేసినవారంతా  ఇప్పుడు డీలా పడిపోయారట. 

ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చాలనే గ్లేమ్‌ ప్లాన్‌?

క్రాస్‌ ఓటింగ్‌ భయంతోనే టీఆర్‌ఎస్‌ జాగ్రత్త పడింది. ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా  నిఘా పెట్టింది. అంతేకాదు.. ఇదే సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కూడా తెరతీసినట్టు సమాచారం. ఆ విషయంలో అధికార పార్టీ సక్సెస్‌ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతంగా గెలిచేంత బలం ఉన్నా..  ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీయడానికి కూడా ఓ లెక్క ఉందట. ఇందూరు జిల్లాలో బలపడాలని అనుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీలను మరింత బలహీన పర్చాలనే గేమ్‌ప్లాన్‌ ఉందట. 

అప్పటికే అధికార పార్టీతో టచ్‌లోకి వెళ్లిపోయారా?

బీజేపీ చివరి నిమిషంలో జాగ్రత్త పడినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయిందని జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్‌. అధికార పార్టీతో చాలామంది టచ్‌లోకి వెళ్లిపోయారట. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దీనికి అతీతంగా ఏమీ లేదట. పైగా కాంగ్రెస్‌లో ఉన్న వర్గపోరులు అధికార పార్టీకి కలిసి వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. మరి.. అధికార పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో.. కాంగ్రెస్‌, బీజేపీ ఎంత నష్టపోతాయో తెలియాలంటే కౌంటింగ్‌ వరకూ ఆగాల్సిదే.