మొతేరా పిచ్‌పై ఆగని విమర్శల మోత

మొతేరా పిచ్‌పై ఆగని విమర్శల మోత

మొతేరా పిచ్‌పై ఆగని విమర్శల మోత ఆగడం లేదు. అయితే తాజాగా ఈ వివాదంపై స్పందించాడు క్రికెట్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ సన్‌. టీమ్‌ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌ల విషయంలో ఇంగ్లాండ్‌ చేస్తున్న రాద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచించాడు. ఇంగ్లాండ్ ఇకనైనా ఈ విషయంపై రచ్చ చేయడం ఆపేయాలని హితవు పలికాడు. భారత్‌లో ఇటీవల జరిగిన చివరి రెండు టెస్టుల విషయంలో పిచ్‌లపై స్పందించమని తనను కొంత మంది కోరారనీ... . అయితే, అది తనకు ఆశ్చర్యమేసిందని చెప్పాడు రిచర్డ్‌. ఎవరైతే పిచ్‌ల గురించి అసహనం వ్యక్తం చేస్తున్నారో వారు ఒక విషయం అర్థం చేసుకోవాలన్నారు రిచర్డ్‌. పేస్‌కు అనుకూలించే వికెట్లపైనా టెస్టు మ్యాచ్‌లు ఆడతారనీ... అప్పుడు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పడిన బంతుల్ని ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్‌ విఫలమౌతారనీ గుర్తుంచుకోవాలన్నాడు రిచర్డ్‌.  అయితే, ఆ సమయంలో సరిగ్గా ఆడలేదంటూ బ్యాట్స్‌మెన్‌పై నిందలేస్తారనీ.. ఒక్కోసారి కొంతమంది ఆటగాళ్లు ఆ బంతుల్ని చక్కగా ఎదుర్కొని ఆడతారనీ చెప్పాడు రిచర్డ్‌. అందుకే వీటిని 'టెస్టు మ్యాచ్‌'లని పిలుస్తారంటూ సెటైర్‌ వేశారు. భారత్‌కు వెళ్లేటప్పుడు... స్పిన్‌కు అనుకూలించే గడ్డ పై అడుగుపెడుతున్నామనే విషయాన్ని ముందే గ్రహించాలన్నాడు రిచర్డ్‌. మూడో టెస్టు ఫలితం ఇంగ్లాండ్‌కు ఓ మంచి అవకాశంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునే వీలు కల్పించిందన్నాడు.నాలుగో టెస్టులోనూ ఇలాంటి వికెటే ఉంటుందని అర్థంచేసుకోవాలన్నాడు. అందుకే, దీనిపై రాద్ధాంతం ఆపేయాలని ఇంగ్లండ్‌కు సూచించాడు. 

పింక్‌బాల్‌ టెస్టు పిచ్‌పై ఇంగ్లాండ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌.. ఫిర్యాదు చేయాలని తలిస్తే.. అది మంచిదికాదని ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. సిల్వర్‌వుడ్‌ ఆ పిచ్‌ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేయాలనుకోవడం ముందే ఓటమిని అంగీకరించినట్లు అవుతుందని చెప్పాడు. ఎవరినైనా వేలెత్తి చూపితే, మిగిలిన నాలుగేళ్లు మనవైపే చూపుతాయనీ... ఇంగ్లాండ్‌ ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలనీ చెప్పాడు పీటర్సన్‌. అదే మ్యాచ్‌లో నేనొక ఇంగ్లాండ్‌ ఆటగాడిని అయి ఉంటే.. బాగా ఆడలేదనే విషయాన్ని కచ్చితంగా చెప్పేవాడినన్నాడు. తర్వాతి టెస్టుకు మరోవారం సమయం ఉండటంతో మరింత బాగా కష్టపడి ఆ మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తానంటూ చెప్పేవాడినన్నాడు. ఎందుకంటే చివరి టెస్టు విజయం సాధించి, భారత్‌లో రెండు మ్యాచ్‌లు గెలుపొంది.. సిరీస్‌ డ్రా చేసుకోవడం మంచి విషయమే అవుతుందన్నాడు పీటర్సన్‌.  ఇంగ్లాండ్‌ కోచ్‌ ఇప్పుడు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా, ఓటమిని అంగీకరించే స్వభావం లేకుండా ఉండాలని పీటర్సన్‌ సూచించాడు. తమ ఓటమికి పిచ్‌ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేసి తర్వాతి మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై దృష్టి సారించాలన్నాడు. 

అంతకు ముందు మొతేరా పిచ్‌పై చెలరేగిన వివాదంపై... మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా స్పందించాడు. పిచ్‌లో ఏమీ లేదని.. ఇంగ్లండ్‌ ఆటగాళ్ల అతి జాగ్రత్తే వాళ్ల కొంప ముంచిందని విశ్లేషించాడు. ఆ తర్వాత పిచ్‌ను విమర్శించే వారికంటే.. ఆటగాళ్ల ప్రదర్శనే పేలవం అనే వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక్కడి పిచ్‌ సవాల్‌ విసిరే వికెటే అయినా.. ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే ఎక్కువగా కనిపించిందని ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌, కామెంటేటర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అన్నాడు. మైకేల్‌ వాన్‌ మాత్రం ఈ వికెట్‌ టెస్ట్‌లకు పనికిరాదని ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ విషయంలో బ్రిటిష్‌ మీడియా రెండుగా విడిపోయింది. ఓ వర్గం పిచ్‌ దారుణంగా ఉందని విమర్శిస్తే.. ది గార్డియన్‌ పత్రిక మాత్రం ఇంగ్లండ్‌ ఆటనే ఎక్కువగా తప్పుబట్టింది. రొటేషన్‌ పాలసీ కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్లే ఘోర పరాభవం ఎదురైందని రాసింది. ఇంగ్లండ్‌ నుంచి ఇంతటి దారుణ ప్రదర్శన చూడలేదని విజ్డెన్‌ పేర్కొంది. అయితే, ద మిర్రర్‌ పత్రిక మాత్రం.. టీమిండియా తన ప్రయోజనాల కోసం హద్దులు దాటుంతోందంటూ అక్కసు వెళ్లగక్కింది. మొతేరాలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించాలని మరో మాజీ ఆటగాడు డిమాండ్‌ చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రూట్‌ సేన బెదిరిన కుందేలులా కనిపించిందని ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ ఎద్దేవా చేశాడు.