తెలకపల్లి రవి: ప్రామాణిక డేటా వుంటేనే కోవిడ్ నివారణ

తెలకపల్లి రవి: ప్రామాణిక డేటా వుంటేనే కోవిడ్ నివారణ

కోవిడ్‌ 19 వైరస్‌ పాజిటివ్‌ సంఖ్య ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టిందని మీడియాలో కథనాలు చాలా వస్తున్నాయి. ఈ తగ్గుదల చాలా స్వల్పంగా  వుండగా మే నెలలో వైరస్‌ వ్యాప్తి తారస్థాయికి చేరుతుందని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్సిన్‌ మందులు ఆస్పత్రులు అన్నీ కొరతగా వుండగా ఇప్పుడే ఆక్సీజన్‌ మాత్రం బాగా అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతున్నది. అదే నిజమైతే మంచిదే కాని వాస్తవరూపం దాల్చవలసి వుంది. సుప్రీం కోర్టుకే ఈ విషయంలో చాలా సందేహాలు కలిగాయి. హైకోర్టులు కూడా తీవ్రాతితీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. 

మిగిన సమస్యలన్నీ ఒక ఎత్తుకాగా ఈ వ్యాధికి మరణాలకు సంబంధించిన లెక్కలు డేటా లభ్యత అన్నిటికన్నాపెద్ద సవాలుగా వుంది. వాస్తవాలను ప్రభుత్వాలు తక్కువగా చూపిస్తున్నాయనే సందేహం బలంగా వుంది.  సార్స్‌ కోవిడ్‌ 2 వైరస్‌ గురించి సరైన అంచనాకు రావాలంటే ఖచ్చితమైన డేటా చాలా అవసరం, ఈ విషయంలో ప్రపంచ దేశాలు చాలా సమస్యనెదుర్కొంటున్నాయి, వ్యాధి గ్రస్తుల నుంచి గాని ఆస్పత్రుల నుంచి గాని ప్రామాణికమైన వాస్తవిక సమాచారం ఇవ్వడంలో తటపటాయింపు ఇందుకు ముఖ్య కారణం. అయితే ఇండియా ఈ విషయంలో మరీ దారుణంగా వుంది. వివిధ రాష్ట్రాలో కోవిడ్‌ తాకిడి వివిధ రకాలుగా వుందని స్పష్టమవుతూనే వుంది. సంఖ్యలోనూ తీవ్రతలోనూ కూడా తేడా వుంది, అయితే దేశంలో కోవిడ్‌ పరీక్షలు చాలా తక్కువగా జరగడం వల్ల వాస్తవంగా వైరస్‌ వున్నదానికంటే లెక్కల్లో కనిపించేది తక్కువగా వున్నట్టు ఐసిఎంఆర్‌ సీరో సర్వేలలో తేలింది, 2020 డిసెంబర్‌ 2021 జనవరి మధ్య జరిపిన సర్వేలో కనీసం 21శాతం మంది భారతీయులలో వైరస్‌ వున్నట్టు ఐసిఎంఆర్‌ తేల్చింది.ఈ వైరస్‌కు సంబంధించిన వివిధ అంశాలను  కలగలపి మదింపు వేసేందుకోసం దేశంలోని పది ప్రయోగశాలలు పని ప్రారంభించింది కూడా గత డిసెంబర్‌లోనే. ఇప్పటికి దాన్నుంచిచెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. రకరకాల వైరస్‌లు (వేరియంట్స్‌) గురించి చెప్పడమే తప్ప నిర్ధారించగల సమాచారం లేదు. మహారాష్ట్రలో బి.1.617 తరహా వైరస్‌ అదికంగా వ్యాపించిందనే భావన వున్నా నిర్ధారణ సాధ్యం కాలేదు. సరైన డేటా అందుబాటులో లేకపోవడమే దీనంతటికీ కారణం.  

మరి డేటాసేకరణ ఎందుకు  జరగడంలేదనే ప్రశ్నకు సమాధానం సులభంగానే దొరుకుతుంది. నిజంగా ప్రజలను ఆదుకోవాలనే ప్రభుత్వాలు కొన్నయితే రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే లక్షణం కూడా ఎక్కువగా వుంది. ఈ క్రమంలోనే తక్కువ చేసి చూపడం కూడా జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రోత్సాహకాలు లేకపోగా తక్కువ చెప్పడంతో సమస్యలు తగ్గుతాయనే భావన ప్రభుత్వాలది. కనుకనే  మీడియాలో వచ్చే కథనాలను ప్రభుత్వ నివేదికలకు పోలిక వుండటం లేదు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఒక అడుగు ముందుకేసి అసు చనిపోయినవారి డేటా వల్ల ప్రయోజనమేమిటి? వారు మళ్లీ బతికిరాబోరు కదా అని వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థమవుతుంది . ఒక వయసు వచ్చాక ఎవరైనా చచ్చిపోతారు గనక విచారం అనవసరమని మధ్యప్రదేశ్‌ మంత్రి ఒకరు అన్నారు. చనిపోయినవారి సంగతి అటుంచి ఆ వివరాల ఆధారంగా మిగిలిన వారినైనా బతికించుకోవడానికి మానవజాతి వైజ్ఞానికంగా కృషిచేస్తుందనే ఇంగిత జ్ఞానం వీరికి లేకపోవడం విచారకరం. సరైన డేటా లేకుండా శాస్త్రీయ నిర్ధారణలు చేయడం సాధ్యం కాదు. అది జరగకుండా చికిత్స నివారణ కూడా కుదిరేపని కాదు. కోర్టులు మిగతా విషయాలతో పాటు డేటా సేకరణకు సంబంధించి కూడా ఖచ్చితమైన ఆదేశాలివ్వడం అవసరం, గత పర్యాయం కరోనా వ్యాప్తిలో విఫలమైన మనదేశం కనీసం ఈ సెకండ్‌ వేవ్‌లోనైనా ఆ లోటును అధిగమిస్తే భవిష్యత్తులో మేలు జరుగుతుంది.