బ్రెజిల్‌లో మరో కొత్త రకం వేరియెంట్.. వణికిపోతున్నారు..!

బ్రెజిల్‌లో మరో కొత్త రకం వేరియెంట్.. వణికిపోతున్నారు..!

కరోనా మహమ్మారి లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌ను వణికిస్తోంది. టీకాలు వచ్చిన వేళ.. అక్కడ వరసగా రెండోరోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. తాజాగా 1,910 మంది వైరస్‌కి బలయ్యారు. మొత్తంగా మరణాల పరంగా ఆ దేశం,  ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. వరల్డో మీటర్ లెక్కల ప్రకారం.. అమెరికాలో 5 లక్షల 31వేల 652 మంది మృత్యువాత పడగా ..బ్రెజిల్‌లో 2లక్షల 59వేల 402 మంది ప్రాణాలు వదిలారు. మొదటి నుంచి కూడా కరోనాను నియంత్రించే విషయంలో బ్రెజిల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైరస్‌ను నిర్లక్ష్యం చేసి, నిపుణుల సూచనలు ఖాతరు చేయకపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సెలవులు, కార్నివాల్స్ తో ఇప్పుడు అక్కడ కరోనా ఉద్ధృతికి కారణమయ్యాయి.

అమెజాన్‌ రెయిన్ ఫారెస్ట్‌లో ఉద్భవించిన పీ1 అనే కొత్త వేరియంట్ కూడా తాజా ముప్పునకు కారణమని నిపుణులు అంటున్నారు. ఆ దేశంలో మొత్తం 27 రాష్ట్రాలుండగా.. 17 రాష్ట్రాల్లో ఈ రకం కరోనా తన ఉనికిని చాటుతోంది. అలాగే 10కి పైగా దేశాలకు కూడా విస్తరించింది. అసలు దానికి కంటే ఈ ఉత్పరివర్తన చెందిన రకం.. వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు పేర్కొన్నాయి. ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకొన్న వారికి కూడా ఇది అంటుకుంటుందని కొన్ని అధ్యయనాలు.. బ్రెజిల్ ను మరింత కలవరపెడుతోంది. అక్కడ వైద్య వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఇప్పటికే 19 రాష్ట్రాల్లో ఐసీయూలు 80 శాతానికి పైగా వినియోగంలో ఉన్నాయని ఫియోక్రజ్ చెప్పింది. ఆసుపత్రులు కిక్కిరిసిపోయి ఉండటంతో, రోగులను పొరుగు ప్రాంతాలకు పంపించాల్సిన దుస్థితి నెలకొంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే బ్రెజిల్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అదీకాక టీకాల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం చైనా అభివృద్ధి చేసిన కరోనావాక్‌, ఆక్స్‌ఫర్డ్ టీకాలను వినియోగిస్తోంది. ఈ టీకాలను రెండు డోసులుగా ప్రజలకు అందించాల్సి ఉంటుంది. జనవరి మధ్యలో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద , ఇప్పటికే 7.1 మిలియన్ల మందికి మొదటి డోసు అందించగా, 2.1 మిలియన్ల మంది రెండో డోసును కూడా స్వీకరించారు. 

212 మిలియన్ల జనాభా ఉన్న బ్రెజిల్ లో.. ఈ ఏడాది చివరి నాటికి అందరికి టీకాలు అందిస్తామంటూ ఆరోగ్యశాఖ మంత్రి చేసిన ప్రతిజ్ఞ, నెరవేరడం దాదాపు అసాధ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ కట్టడికి అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేకపోవడంతో.. స్థానిక ప్రభుత్వాలే తమవంతుగా తాజాగా నియంత్రణ చర్యలకు పూనుకున్నాయి. ఈ పరిస్థితికి  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ ప్రతిపక్షాలు.. దేశ అధ్యక్షుడిపై మండిపడ్డాయి. రోజుకు వేయికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఒకేరోజు ఐదు విమానాలు కూలినప్పుడు.. ఇంతమంది ప్రాణాలు వదులుతారు. ప్రభుత్వం సకాలంలో  స్పందించకపోవడం వల్లే ఈ దుర్భర పరిస్థితికి కారణమని అధ్యక్షుడిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.