హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లాక్ డౌన్, తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే...!

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లాక్ డౌన్, తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే...!

విశ్వవ్యాప్త మహమ్మారి కరోనా వైరస్ పంజా నుంచి దేశాన్ని  రక్షించేందుకు.. కేంద్రం లాక్ డౌన్ విధించింది. కరోనా వైరస్ అదుపుకాకపోవడంతో.. ఇప్పటికి మూడు సార్లు లాక్  డౌన్ పొడిగించింది. నేటికి లాక్ డౌన్ విధించి 50రోజులు గడిచాయి. 50రోజుల లాక్ డౌన్ పరిణామాలను ఒకసారి రివైండ్ చేసుకుంటే...

జనవరి 22న చైనాలోని వుహాన్ లో పుట్టిన రాకాసి వైరస్.. చైనాను  గడగడలాడించింది. అది ఎల్లలు దాటి యూరప్ లో పాగా వేసింది. ఇటలీలో  మరణశాసనం లిఖించింది. అటు తర్వాత అమెరికాలోనూ  అడుగు పెట్టింది.  రికార్డ్ స్థాయిలో జనం మరణించారు. దీంతో భారత ప్రభుత్వం  అప్రమత్తమైంది.  మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలై.. మూడు లాక్ డౌన్‌లను దేశం చవిచూసింది.ఇవాళ్టికి లాక్ డౌన్ ప్రకటించి 50రోజులైంది.

లాక్ డౌన్ -1.0..మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకూ.. 21 రోజుల పాటు  దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అన్ని సర్వీసులు  నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు.. నిత్యవసరాల కొనుగోళ్ల కోసం  ఎగబడ్డారు. దీనితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసరాల సరఫరాకు  ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాయి. అయితే లాక్ డౌన్  ఉల్లంఘనలు జరగకుండా పోలీసులు... పూర్తిస్థాయి భద్రతా చర్యలు  చేపట్టారు. 21 రోజుల పాటు పేదవాడు బయటకు రాకుంటే పోషణ ఎలా అన్న ప్రశ్న  తలెత్తడంతో.. చాలా  రాష్ట్రాలు నిరుపేదలకు రిలీఫ్ ఫండ్స్ ప్రకటించాయి. మార్చి 26న కేంద్రం కూడా ఓ ప్యాకేజి  ప్రకటించింది. 

లాక్ డౌన్ ఎఫెక్ట్ కు గురైన వారికోసం.. లక్షా 70వేల కోట్ల  రూపాయల ఉద్దీపన ప్యాకేజీని.. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్  ప్రకటించారు. మూడునెలల పాటు కుకింగ్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లాంటి సదుపాయాలు కల్పించారు. ఆర్బీఐ కూడా.. లాక్ డౌన్ తో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని... లోన్లకు సంబంధించి..  మూడునెలల పాటు ఈఎంఐలు కట్టకున్నాపర్లేదని  ప్రకటించింది.  మరోవైపు ఇండియన్ రైల్వేస్.. మార్చి 31 వరకూ సర్వీసులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.మార్చి 29న ట్రాన్స్ పోర్టు సర్వీసులు  పునరుద్ధరించినట్లు వెల్లడించింది. దీనికితోడు  పేషెంట్ల కోసం.. కోచ్ ను  ఐసోలేషన్ కు ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు..  అందరూ దీపాలు, క్యాండిల్స్ వెలిగించారు.. వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు  తెలిపారు. అయితే తొలిదశ లాక్ డౌన్ ముగిసే సమయానికి చాలా  రాష్ట్రాలు.. లాక్ డౌన్ పొడిగించాలని ... కేంద్రానికి సూచించాయి. 

లాక్ డౌన్ 2.0.. ఏప్రిల్ 15 నుంచి మే 3వరకూ కొనసాగింది. ఏప్రిల్ 14న  ప్రధాని మోడీ.. లాక్ డౌన్  పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.అయితే  ఎక్కడైతే  వైరస్ అదుపు కనిపిస్తుందో .. అక్కడ ఏప్రిల్ 20 తర్వాత కండిషనల్  రిలాక్షేసన్ ప్రకటించారు మోడీ. ఏప్రిల్ పదహారు నుంచి ప్రభావిత  ప్రాంతాలను జోన్లవారీగా విభజించారు. రెడ్ జోన్..  ఇది వైరస్ హాట్ స్పాట్‌.  ఇక ఆరెంజ్ జోన్.. కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇకగ్రీన్  జోన్.. సేఫ్ జోన్.దీనితో పాటుగా కొన్ని రంగాలకు సడలింపులు ప్రకటించారు. అగ్రి బిజినెస్,  డెయిరీ, ఆక్వా, ప్లాంటేషన్ ... నిత్యవసరాల సరఫరాకు సంబంధించి చైన్ షాపులు ఓపెనయ్యాయి.సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. పబ్లిక్ వర్స్క్ ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 29న వలస కార్మికుల తరలింపునకు సంబంధించి గైడ్ లైన్స్ ను.. కేంద్ర హోంశాఖ జారీ చేసింది. 


మే నాలుగు నుంచి పదిహేడో తేదీవరకూ.. లాక్ డౌన్ 3.0 ను దేశవ్యాప్తంగా విధించారు ప్రధాని మోడీ. దీనికి సంబంధించి మే ఒకటో తేదీన .. హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే కొద్దిపాటి సడలింపులు ఇచ్చింది.దేశాన్ని మూడు జోన్లుగా విభజిచింది. ఇందులో రెడ్ జోన్ లోకి 130 జిల్లాలు వచ్చాయి.ఆరెంజ్ జోన్-284, గ్రీన్  జోన్-319 జిల్లాలు వచ్చాయి. అయితే పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులూ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించింది. గ్రీన్ జోన్లలో 50శాతం సీటింగ్ కెపాసిటీతో బస్సులు నడపవచ్చని తెలిపింది. ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ , హైర్డ్ ట్రాన్స్ పోర్టేషన్ సమ్మతించింది. రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు. అయితే నెలరోజులకు పైగా లాక్ డౌన్ ఉండడంతో..చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలుకోల్పోయారు.. 

సుప్రీంకోర్టు వలస కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యలు వివరించాలని కేంద్రానికి సూచించింది. మే1నుంచి వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు నడిపేందుకు..కేంద్రం అనుమతించింది.ఆ చార్జీల్లో 85 శాతం రైల్వే, మిగిలిన పదిహేను శాతం సంబంధిత రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. మే పన్నెండున మోడీ... 20 ట్రిలియన్ రూపీస్.. ప్యాకేజీ ప్రకటించారు. లాక్ డౌన్ 4.0 కూడా ఉంటుందని సూచన ప్రాయంగా ప్రకటించారు మోడీ.


ప్రస్తుతం..రైల్వే, మెట్రో సర్వీసులు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్, సినిమాహాల్స్, మాల్స్, సామూహిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది.