రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న గ్రేటర్ వరంగల్ అధికారులు..

రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న గ్రేటర్ వరంగల్ అధికారులు..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్న ఉద్యోగుల పైనానే చర్యలుంటాయా? రాజకీయ అండదండలున్నవారిపై ఏ చర్యలుండవా? యూనియన్ నేతలు ఏ పనీ చేయకపోయి పర్వాలేదా? ఇదే ఇప్పుడు గ్రేటర్ వరంగల్ లో నడుస్తున్న చర్చ..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే ఆక్రమాలకు అడ్డా అనే ఆరోపణలున్నాయి. ఉద్యోగం వచ్చినప్పటినుండి ఒకే సీట్లో ఉన్న ఉద్యోగులు కూడా ఇక్కడున్నారు. రాజకీయ నాయకుల అండతో కొందరు ఆడింది ఆట పాడింది పాటగా సాగిస్తున్నారని ఆరోపణలున్నాయి. కమీషనర్లు మారుతున్నా, వీరిపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండటం లేదట.  మరి కొందరైతే, యూనియన్ ను అడ్డుపెట్టుకుని  ఆక్రమాలకు పాల్పడుతున్నారట.  అయితే, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తగా వచ్చిన కమిషనర్ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఎక్కడ  అవకతవకలు జరుగుతున్నాయో తెలుసుకుని వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

వరంగల్ మహా నగర పాలక సంస్థలో ఇంటి నెంబర్లివ్వడంలో అక్రమాలు జరిగాయనే ఆర్ఐ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు. అందుకు సహకరించిన ఇద్దరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా తొలగించారు. ఆ తర్వత, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సెక్షన్ ఇంచార్జి లను కూడా అంతర్గతంగా బదిలీలు చేశారు. ఒక్కసారిగా కమిషనర్ తీసుకున్న చర్యలతో చాలా మంది ఉద్యోగుల అదనపు ఆదాయానికి చెక్ పడిందట.

ఇక్కడి వరకు అంతా సవ్యంగానే కనిపిస్తున్నా, కమీషనర్ తీసుకున్న చర్యలు కొందరికే పరిమితమయ్యాయనే ఆరోపణలు పెరిగాయి. ఏ అండా లేనివారిని బదిలీ చేసి, చర్యలు తీసుకుని, కాస్త గట్టిపిండాలను టచ్ చేయకుండా వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న ఉద్యోగుల పై వేగంగా చర్యలు తీసుకున్న కమిషనర్ యూనియన్ లీడర్లను  కనీసం బదిలి కూడా చేయకపోవడం పై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందట. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకున్న కమీషనర్, వాటికి బాధ్యులైన అసలు అధికారులను మాత్రం వదిశారనే టాక్ నడుస్తోంది. బల్దియాలో ఓ ఉద్యోగి సుమారు 15 ఎళ్లుగా ఒకే సీటులో పనిచేస్తున్నారట. యూనియన్ పెద్ద కావడంతో  అతనిపై బదిలీ వేటు పడలేదనే టాక్ ఉంది. ఇంతమందిని బదిలీ చేసిన కమిషనర్, ఆ వ్యక్తిపై  ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు పెరిగాయి. పనిలేని పోస్టులో ఉంటూ నెలకు 70వేల జీతం తీసుకునే ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోదనే టాక్ ఉంది. 

బల్దియాలో జరుగుతున్న చాలా ఆక్రమాలకు ఒక ఉద్యోగే కారణమనే టాక్ ఉంది. ఈ మధ్య నకిలీ మెడికల్  ఫిట్ నెస్ సర్టిఫికెట్లతో  ఉద్యోగం పొంది సస్పెండ్ అయిన వారు ఆ యూనియన్ నేత అండతోనే ఉద్యోగంలో చేరారనే ఆరోపణలున్నాయి  మరి కొందరు యూనియన్ పెద్దలు,  తమకు సంబంధించిన బందువులను  అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పెట్టించి, వారిద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారనే టాక్ ఉంది. పది, పదిహేనేళ్లుగా పనిచేస్తున్నఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవర్నీ పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరట.  కమిషనర్ యూనియన్ నేతలతో పాటు, ఈ బంధుగణంపై కూడా దృష్టిపెడితే తప్ప ఇక్కడ అక్రమాలు ఆగవనే చర్చ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ లో జరుగుతోంది.