ఆయన వెళితే దుబ్బాకలో సీన్ మరోలా ఉండేదా...?

ఆయన వెళితే దుబ్బాకలో సీన్ మరోలా ఉండేదా...?

ఆయ‌న వెళ్లితే దుబ్బాక‌లో మ‌రోలా ఉండేదా? ఇప్పుడు ఇదే ఆ పార్టీలో చర్చ. ఓడిపోవడంతో రోజుకో లెక్క వేసుకుంటోంది అధికారపార్టీ. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.

భవిష్యత్‌ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందా? 

దుబ్బాక‌లో అధికార టీఆర్‌ఎస్‌ -బీజేపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగింది. చివరకు బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. మెజారిటీని పక్కనపెడితే దుబ్బాకలో గెలుపోటములనే అంతా విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నికలో గెలిచిన ఊపుతో బీజేపీ భవిష్యత్‌ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న్న భావ‌న రాజకీయ వర్గాల్లో ఉంది. త్వరలో జ‌రిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, GHMC, ఇతర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల్లో పోటీ ఎవ‌రి మ‌ధ్య అన్న అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. 

ప్రచారానికి మంత్రులను కూడా పంపలేదు సీఎం కేసీఆర్‌!

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ బాధ్యతలను స్థానిక మంత్రి హ‌రీష్‌రావుకు అప్పగించారు. గ‌తంలో ఎన్నో కీల‌క‌మైన బైఎలక్షన్లు, ఎన్నిక‌ల్లో  టీఆర్‌ఎస్‌ను గెలుపు బాట పట్టించారు హరీష్‌రావు. దాంతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కానీ దుబ్బాక వైపు వెళ్లలేదు. 
ఎక్కువ‌ మంది వెళ్లితే.. ప్రతిపక్షాలు లాభపడతాయన్న లెక్కలతో దూరంగా ఉన్నారు అధికార పార్టీ నాయకులు. క‌నీసం ఇతర మంత్రుల‌ను కూడా దుబ్బాక ప్రచారానికి పంపించలేదు. వ్యూహాత్మకంగానే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోలిపేట రామ‌లింగారెడ్డి చ‌నిపోవ‌డంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో ఆయన భార్య సుజాతే అభ్యర్థి కావడంతో వీలైనంత తక్కువ హడావిడితో పోరు ముగించాలని కోరుకుంది టీఆర్‌ఎస్‌. ఇదే సమయంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పట్టు బిగించింది. 

సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసి ఉంటే దుబ్బాక నిలిచేదా? 

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు దాదాపు మంత్రులంతా వెళ్లి ప్రచారం చేశారు. కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించారు. చివర్లో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ ఏర్పాటు చేశారు. అయితే వాతావరణం అనుకూలించక చివరిక్షణంలో ఆ సభ రద్దయింది. అయినప్పటికీ హుజూర్‌నగర్‌లో భారీ మెజారిటీతో గెలిచింది టీఆర్‌ఎస్‌. దుబ్బాకకు వచ్చేసరికి  కేవలం వెయ్యి ఓట్ల  స్వల్ప తేడాతో ఓడిపోవడం పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. చివరిలో సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసి ఉంటే ఈజీగా దుబ్బాకను నిలబెట్టుకునేవారమని పార్టీలో చర్చ మొదలైంది. పైగా గజ్వేల్‌, సిద్ధిపేటకు మధ్యలో  దుబ్బాక ఉండటం.. ఆ నియోజకవర్గంతో కేసీఆర్‌కు విడదీయలేని  సంబంధం ఉండటంతో కలిసి వచ్చేదని అనుకుంటున్నారట. 

దుబ్బాక అభివృద్ధికి పోలిక లేదా? 

ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. సిద్దిపేట‌, గ‌జ్వేల్ మ‌ధ్య దుబ్బాక ఉండ‌టం కూడా న‌ష్టం జరిగిందన్న విశ్లేష‌ణ‌లున్నాయి. సిద్ధిపేట హ‌రీష్‌రావు, గ‌జ్వేల్ కేసీఆర్‌ నియోజ‌కవ‌ర్గాలు కావ‌డంతో అక్కడ బాగా అభివృద్ధి జ‌రిగింది. వాటితో దుబ్బాక అభివృద్ధికి పోలిక లేక‌పోవ‌డం వ‌ల్ల టీఆర్‌ఎస్‌కు ఒక‌ర‌కంగా నష్టం జ‌రిగింద‌న్న వాద‌న ఉంది. అందుకే రాబోయే ఎన్నికల్లో ఏమరపాటు వద్దని పార్టీ నేతలను సీఎం కేసీఆర్‌ హెచ్చరించడాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు గులాబీ నాయకులు.