ఎమ్మెల్సీ ఎన్నికలపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్సీ ఎన్నికలపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు

పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడంతో.. మళ్లీ అదే జరుగుతుందన్న ఆశల్లో ఉన్నారట. దాంతో టికెట్‌ ఆశించే వారి జాబితా పెరిగిపోతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో వెనకబడ్డ మాజీ ఎమ్మెల్యేలు ఏదో విధంగా ఎమ్మెల్సీ అయి.. చట్ట సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారట. 

రాజధాని ప్రాంత ఎమ్మెల్సీ కావడంతో పార్టీలు ఫోకస్‌!

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది MLC ఎలక్షన్‌ జరగనుంది. ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ నేత రామచంద్రరావు సభ్యుడిగా ఉన్నారు. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకే గ్రాడ్యుయేట్లు పట్టం కట్టారు. ఈసారి దాదాపు ఐదున్నర లక్షల మందికిపైగా ఓటర్లు పేర్లు నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో ప్రధాన పార్టీలు ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్నాయి. ఇదే రేస్‌ కాంగ్రెస్‌లోనూ కనిపిస్తోంది. 


కాంగ్రెస్‌ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి!

మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు చాలా మంది పోటీకి ఉవ్విళ్లూరుతున్నారట. రేస్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, AICC కార్యదర్శులు, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపొందడంతో.. ఇక్కడ కూడా కాస్త కష్టపడితే ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో పడతాదని లెక్కలు వేసుకుంటున్నారట. 

రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచీ పోటీ!

మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి,  సంపత్‌కుమార్‌, మాజీ మంత్రి  చిన్నారెడ్డి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు  ఒబేదుల్లా కొత్వాల్‌, సీనియర్ న్యాయవాది వెంకటేశ్‌లు పోటీకి సిద్ధంగా ఉన్నారట. వీరికి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కాంగ్రెస్‌ నేతల నుంచి పోటీ ఉందట. మాజీ ఎమ్మెల్యేలు కిచ్చనగారి లక్ష్మారెడ్డి,  పరిగి రామ్మోహన్‌రెడ్డి సైతం పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారట.

ఎవరికి వారుగా బరిలో దిగుతారా.. ఒక్కరికే మద్దతిస్తారా?

వీరంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే.  కానీ.. కరీంనగర్‌ నుంచి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత వీరందరిలో ఆశ పుట్టిందట. మరి.. కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా  ఎవరినైనా అభ్యర్థిని ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి. అంతా కలిసి పార్టీ విజయం కోసం ఒకరిని బరిలో దించితే సరి.. లేదంటే ఎవరికి వారుగా బరిలో దిగితే ఓట్ల సమీకరణాలు మరిపోయే అవకాశం ఉంది. పరిస్థితి చూస్తుంటే రానన్న రోజుల్లో పోటీకి మరికొంత మంది  ముందుకొచ్చే వీలుంది. మరి.. చివరకు ఎవరు బరిలో దిగుతారో చూడాలి.