'సిట్' ను ఏర్పాటు చేయడం వింతగా ఉంది

'సిట్' ను ఏర్పాటు చేయడం వింతగా ఉంది

తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన డేటా వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి స్పందించారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు  చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వింతగా ఉందన్నారు. ఐటి గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణపై తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు. మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

పొరుగు రాష్ట్రంలో జరిగే అన్యాయానికైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తారా. అదే అన్యాయం జరిగితే  సిట్(కూర్చోండి) అని ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తారు. కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్ధ అంటే ఇలాగే ఉంటుందేమో?. ఇక్కడ గమనించాల్సిన మరో ప్రధాన విషయం ఏమిటంటే...ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, వైసీపీ అధినేత జగన్ గవర్నర్ ను కలిసి, ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన కొన్ని నిమిషాలలోపే ఈ వివాదానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం సిట్  విచారణకు ఆదేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మోడీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందన్న వాదనను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ముసుగు తొలగిపోయింది.. అని విజయశాంతి పేర్కొన్నారు.