వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు

ఆ ఎంపీకి ఎమ్మెల్యేలతో పడటం లేదు. ఎమ్మెల్యేలకు ఆ ఎంపీతో పడటం లేదు. మొన్నటి వరకూ ఓ ఎమ్మెల్యే ఆయన్ని తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదే  చేస్తున్నారు. ప్రాబ్లమ్‌ ఎంపీదా.. ఎమ్మెల్యేలదా? 

ఎంపీని రెండుసార్లు అడ్డుకున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే వర్గం!

గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉంటున్నాయి. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు.. ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌ పెరిగిపోతోంది. మొన్నటి వరకూ చిలకలూరిపేటలో అడుగుపెట్టనివ్వలేదు స్థానిక ఎమ్మెల్యే విడదల రజని. తనను కాదని రెండుసార్లు నియోజవర్గానికి వచ్చిన ఎంపీని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంతో రచ్చ రచ్చ అయింది. వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతో ఎమ్మెల్యే  శిబిరం గరంగరం అవుతోంది. సరిగ్గా ఇలాంటి సమస్యే అటు వినుకొండలోనూ రాజుకుంటోంది. 

తన మాట పట్టించుకోలేదని ఎమ్మెల్యే బొల్లా ఎంపీని దూరం పెట్టారా?

తాజాగా ఆ జాబితాలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేరారు. బ్రహ్మనాయుడు .. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు అస్సలు పడటం లేదు. ఎన్నికల సమయంలో నరసరావుపేటకు ఆఖరి సమయంలో వైసీపీ ఇంఛార్జ్‌గా వచ్చిన లావు.. తనతోపాటు కాంగ్రెస్‌ DCC అధ్యక్షుడిగా ఉన్న.. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును వైసీపీలోకి తీసుకొచ్చారు. లావు, బొల్లా, మక్కెన ముగ్గురూ ఒకే సామాజికర్గానికి చెందిన వారు. అయినా రాజకీయాల్లో ఎవరి దారి వారిదే. మక్కెనను వైసీపీలోకి తీసుకురావడం తనకు ఇష్టం లేదని లావుకు బొల్లా స్పష్టం చేసినట్లు చెబుతారు. అయినా ఎంపీ తన మాట పట్టించుకోలేదన్న కారణంతో లావును దూరం పెట్టారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. 

బొల్లా దగ్గర పనులు కానివారిని పిలిపిస్తున్న మక్కెన!

ఎన్నికలు ముగిసి ఏడాది దాటినా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఈ వైరం తగ్గలేదు కదా.. ఇంకా పెరిగిందని అంటారు. వినుకొండకు తాను ఎమ్మెల్యే అయినా.. ఎంపీ మాత్రం మక్కెనకు ప్రాధాన్యం ఇవ్వడంపై బ్రహ్మనాయుడు మండిపడుతున్నారట. మక్కెన వర్గం కూడా ఇదే టైమ్‌ అనుకుందో ఏమో కానీ.. ఎమ్మెల్యే బొల్లా వద్ద పనులు కాని వారిని పిలిపించి మరీ..ఎంపీ దగ్గర కూర్చోబెట్టి పనులు చేయించి పెడుతున్నారట. 

పనులు కానివారిని ఎంపీ దగ్గరకు తీసుకెళ్తున్న మక్కెన!

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మంచైనా.. చెడు అయినా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఇది చాలా మందికి గిట్టడం లేదట. ఇలా అసంతృప్తి చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే మక్కెనను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారందరినీ ఎంపీ దగ్గరకు తీసుకెళ్తున్నారట మక్కెన.  పెండింగ్‌ బిల్లుల మంజూరు.. చిన్న చిన్న కాంట్రాక్ట్‌ పనులు ఇలా ఏం కావాల్సి వచ్చినా.. ఎంపీ దగ్గర కూర్చోబెట్టి అధికారులకు ఫోన్‌లు చేయిస్తున్నారట. 

వినుకొండకు ఎంపీని ఆహ్వానించని ఎమ్మెల్యే బొల్లా!

ఈ సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రుసరుసలాడుతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని.. మక్కెనకు ఎంపీ ఎలా వత్తాసు పలుకుతారని ఎంపీపై ఒంటి కాలిపై లేస్తున్నారట. ఇది మనసులో పెట్టుకున్నారో ఏమో వినుకొండలో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించడం లేదట బొల్లా. ఒకవేళ ఎంపీని పిలిస్తే వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన కూడా వచ్చే పరిస్థితి ఉండటంతో ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. ఆ మధ్య కరోనా సమీక్షా సమావేశంలో ఏడాది తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతానికి రెండు వర్గాలు ఈ ఆధిపత్యపోరుపై ఎక్కడా బయటపడకపోయినా..పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉందట. మరి.. ఈ నిప్పును ఇలాగే అదిమిపెడతారో.. మరింత  రాజేసుకుంటారో చూడాలి.  లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీతో ఎలా ఉంటారో చూడాలి.